Cong MLA Rammohan Fires on KCR : తెలంగాణ రాష్ట్రంలో తిరిగి తాము అధికారంలోకి వస్తామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పగటి కలలు కంటున్నారని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కోరితేనే విద్యుత్ అవకతవకలపై ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్ వేసిందన్నారు. అవినీతి బయట పడుతుందనే ఎల్.నర్సింహా రెడ్డి కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కాలేదని ఆరోపించారు. కుమార్తె కవితను కాపాడుకోవడానికి బీజీపీతో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ధ్వజమెత్తారు. రూ.7 లక్షల కోట్లు అప్పులు చేసి, రూ.వేలాది కోట్లు దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
హరీశ్‌రావు పార్టీ మార్పుపై వ్యాఖ్యలు : మాజీ మంత్రి హరీశ్‌రావు మాటలు నమ్మొద్దని, ఆయన బీజేపీలోకి వెళతాడని ఆరోపించారు. ఇప్పటికైనా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని రామ్మోహన్ రెడ్డి సూచించారు. రూ.లక్ష రుణమాఫీ చేస్తామని వాయిదాల పద్ధతిలో చేశారని మండిపడ్డారు. ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాలు కావాలని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించారన్నారు. వచ్చిన ఆరు నెలల్లోనే రూ.2 లక్షల రుణమాఫీ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి అవసరమైన కార్యాచరణతో ముందుకు వెళుతున్నారని తెలిపారు. అధికారంలోకి రాగానే 30 వేల ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు.
"పదేళ్లు అధికారంలో ఉండి రైతులకు సరిగ్గా రుణమాఫీ చేయలేదు. అసెంబ్లీకి రాకుండా ప్రజల సమస్యలపై మాట్లాడుతున్నారు. అసెంబ్లీకి వచ్చి మీ నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వాలని అనుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ గురించి చర్యలు చేపట్టింది అనుకున్నట్టు గానే ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తాం. హరీశ్‌రావు కూడా బీజేపీలోకి వెళ్లిపోతారు. ప్రజలు మీకు అధికారం ఇస్తే రాష్ట్రంలో ఏడు లక్షల కోట్లు అప్పులు చేశారు." - రామ్మోహన్, ఎమ్మెల్యే
అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని, ఇప్పుడేమో ఫామ్‌హౌస్‌కు పిలిచి మరీ భోజనాలు పెడుతున్నారని విమర్శించారు. తమ భవిషత్తు, నియోజకవర్గ అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ ఎమెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఆయన వివరించారు.
మనసు మార్చుకున్న జీవన్‌రెడ్డి - పార్టీనే ముఖ్యమని వ్యాఖ్య - MLC Jeevan Reddy Resign Issue