Complaints on YSRCP Candidates Nominations: ముఖ్యమంత్రికి బటన్ నొక్కడం తప్ప ఇంకేం తెలీదు. ఇసుక, మట్టి దందా, భూముల కబ్జా తప్ప మంత్రులకేమీ తెలీదు. ఇక ఎమ్మెల్యేల పరిస్థితి చెప్పేదే కాదని ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు అక్షర సత్యాలుగా నిలుస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన నామినేషన్లలో కుప్పలు తెప్పలుగా తప్పులు దొర్లడం వారి అజ్ఞానానికి అద్దం పడుతోంది. ఒకరిద్దరి విషయంలో అధికారులు సైతం ఆశ్చర్యానికి గురైనట్లు సమాచారం.
'మరీ ఇంత కఠినంగా ఉంటే కష్టం. మీరే నష్టపోతారు. మీరు ప్రభుత్వ ఉద్యోగులు. మేం రాజకీయ నాయకులం అని గుర్తు పెట్టుకోవాలా? మా మీద ఇష్టం వచ్చినట్లు ఉల్లంఘన కేసులు పెట్టేస్తున్నారు, మేం ప్రైవేటు కేసులు వేస్తే మీరు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది జాగ్రత్త, కాబట్టి కాస్త చూసీచూడనట్లు వెళ్లండి'. ఒంగోలు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రిటర్నింగ్ అధికారిని హెచ్చరించిన తీరిది. దీనిపై టీడీపీ నేతలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడం విదితమే.
ఆస్తుల వివరాలు దాచేయడం, తప్పుడు సమాచారం, అధికారులను పక్కదోవ పట్టించడం వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్లలో తప్పులను ప్రత్యర్థులు ఇట్టే పసిగట్టి ఫిర్యాదు చేశారు. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 25న గడువు ముగిసింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియగా ప్రధాన పార్టీలు సహా రిజిస్టర్డ్, రికగ్నైజ్డ్ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్ధులు నుంచి పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి.
25 లోక్‌సభ నియోజకవర్గాలకు 911 నామినేషన్లు దాఖలైనట్లు ఈసీ వెల్లడించింది. అదే విధంగా 175 అసెంబ్లీ స్థానాలకు 5 వేల 230 నామినేషన్లు దాఖలైనట్లు ప్రకటించింది. ఇవాళ స్క్రూటినీ నిర్వహించగా పదుల సంఖ్యలో ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లలో తప్పులు దొర్లాయి. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29 వరకు అవకాశం ఉండగా నామినేషన్లలో అర్హులైన వారి జాబితాను అధికారులు సిద్ధం చేయాల్సి ఉంది.
పెండింగ్‌లో బుగ్గన - వివేకా హత్య కేసు నిందితుడి నామినేషన్ తిరస్కరణ - Nominations Scrutiny
ఫిర్యాదుల వెల్లువ:
- అఫిడవిట్లలో వివరాలు సరిగ్గా తెలియజేయలేదని ఇరు పక్షాల అభ్యర్థులు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. గుడివాడలో వైఎస్సార్సీపీ అభ్యర్థి కొడాలి నాని సహా పాటు పలు నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు తప్పుడు అఫిడవిట్లతో నామినేషన్‌లు దాఖలు చేశారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కాగా, అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది.
- నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి బుగ్గన ఆస్తుల వివరాలు చూపించలేదని ఆరోపిస్తూ టీడీపీ ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన నామినేషన్‌ను ఎన్నికల అధికారి పెండింగ్‌లో ఉంచారు.
- నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి కోట్ల విలువైన ఆస్తులు దాచేశాడని స్వతంత్ర అభ్యర్థి విష్ణువర్ధన్‌రెడ్డి అభ్యంతరం తెలిపారు.
- అనకాపల్లి జిల్లా పెందుర్తి వైఎస్సార్సీపీ అభ్యర్థి అదీప్‌రాజ్ కేసులను ప్రస్థావించలేదని జనసేన అభ్యర్థి ఫిర్యాదు చేశారు.
- నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వలేదని రాజంపేట వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి మిథున్‌రెడ్డి, పార్వతీపురం అసెంబ్లీ అభ్యర్థి అలజంగి రవికుమార్, ఇచ్ఛాపురం అసెంబ్లీ అభ్యర్థి పిరియ విజయ ఫార్మ్‌పై ఫిర్యాదులు అందాయి.