CM Revanth Key Comments On KTR Arrest : గవర్నర్ అనుమతి రాగానే ఈ-రేస్ స్కామ్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా గవర్నర్ అనుమతి నుంచి తప్పించుకునేందుకు దిల్లీలో లాబీయింగ్ కోసం కేటీఆర్ దిల్లీ వచ్చారన్నారు. ప్రస్తుతం దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ-రేస్ స్కామ్‌లో గవర్నర్ అనుమతి కోసం వేచిచూస్తున్నట్లు తెలిపారు.
కేటీఆర్ దిల్లీ పర్యటనలో బీజేపీ-బీఆర్‌ఎస్ చీకటి బంధం బయటపడుతోందన్నారు. బీజేపీని అంతం చేస్తానని గతంలో కేటీఆర్ చాలాసార్లు అన్నారని, ఇప్పుడు ఆయనే ఆ పార్టీ నేతలను ఎలా కలుస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అమృత్ టెండర్ల విషయంలో బీఆర్‌ఎస్ ఆరోపణలను ముఖ్యమంత్రి ఖండించారు. రెడ్డి పేరు మీద ఉన్న వారంతా తన బంధువులు కాదని స్పష్టం చేశారు. సృజన్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి అల్లుడే అని సీఎం తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో సృజన్‌రెడ్డికి వేలకోట్ల రూపాయల పనులు ఇచ్చారని చెప్పారు. అమృత్ టెండర్లలో అవినీతి జరగలేదని ఉపేందర్ రెడ్డే చెప్పారని గుర్తుచేశారు. అమృత్ టెండర్లపై కోర్టుల్లో కేసులు వేస్తామన్నా, వేసుకోండని సీఎం తేల్చిచెప్పారు.
"ఈ-రేస్ స్కామ్ నుంచి తప్పించుకునేందుకు కేటీఆర్ దిల్లీ వచ్చారు. గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్‌పై చర్యలు ఉంటాయి. బీజేపీని అంతం చేస్తానన్న కేటీఆర్ ఇప్పుడు ఆ పార్టీ నేతలను ఎలా కలుస్తున్నారు? బీజేపీ-బీఆర్‌ఎస్ చీకటి బంధం బయటపడుతుంది."-సీఎం రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
ఎంతటి వారైనా ఊచలు లెక్క పెట్టాల్సిందే : మరోవైపు ఫార్మాసిటీ విషయంలో వికారాబాద్‌లో కలెక్టర్‌పై దాడిని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో ఉన్న వారు ఎంతటి వారైనా ఊచలు లెక్క పెట్టాల్సిందేనని తేల్చిచెప్పారు. దాడులు చేసిన వారిని, చేయించిన వారిని ఎవర్నీ వదలబోమని సీఎం స్పష్టం చేశారు. అధికారులపై దాడులను బీఆర్‌ఎస్ ఎందుకు ఖండించదని ఆయన ప్రశ్నించారు. దాడి చేసిన వారిని పరామర్శించడాన్ని ఆయన తప్పుపట్టారు. మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు ఓటేయద్దంటే బీజేపీకి సహకరించినట్లు కాదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాత్రి దిల్లీలో బస చేయనున్న ముఖ్యమంత్రి రేపు మహారాష్ట్ర వెళ్లి అక్కడ తెలుగువారు అధికంగా ఉండే ప్రాంతాల్లో పార్టీ తరఫున ప్రచారం చేయనున్నారు.
సీఎం రేవంత్ ఇలాకాలో కలెక్టర్‌పై దాడి - రాళ్లు, కర్రలతో తిరగబడ్డ రైతులు
తప్పు చేసిన వారిపై త్వరలోనే ఆటం బాంబులు పేలతాయ్! : మంత్రి పొంగులేటి