CM Revanth Reddy Road Show at Siddipet : ఆరునూరైనా మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. మెదక్‌లో కాంగ్రెస్ గెలవబోతోందంటే కార్యకర్తలే కారణమని అన్నారు. సిద్దిపేటను 45 ఏళ్ల నుంచి పాపాల భైరవుల్లా మామ, అల్లుడు పట్టిపీడిస్తున్నారని ధ్వజమెత్తారు. మామ, అల్లుడి నుంచి సిద్దిపేటకు విముక్తి కల్పించటానికే వచ్చానని ప్రకటించారు. సిద్దిపేటలో నిర్వహించిన ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
నెహ్రూ, ఇందిర వల్లే వేలాది పరిశ్రమలు మెదక్‌కు వచ్చాయని సీఎం రేవంత్ గుర్తు చేశారు. మెదక్ లోక్‌సభ స్థానం నుంచి ఇందిరా ప్రాతినిధ్యం వహించారని తెలిపారు. అక్రమంగా ఫామ్‌హౌజ్‌లు కట్టుకున్నవాళ్లు కావాలా అంటూ సీఎం ప్రశ్నించారు. సిద్దిపేట గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరకుంటే శాశ్వతంగా బానిసత్వం వస్తుందని హెచ్చరించారు. ఇక్కడ పోటీ చేయాలంటే పోలీసుల చేత కేసులు పెట్టిస్తారన్నారు. వెంకట్రామిరెడ్డి నగదు చూసే మామ, అల్లుడు టికెట్ ఇచ్చారని ఆరోపణలు చేశారు. కలెక్టర్‌గా ఉన్నప్పుడు వెంకట్రామిరెడ్డి వందల ఎకరాలు కొల్లగొట్టారని విమర్శించారు. నిజాం దగ్గర ఖాసీం రిజ్వీ మాదిరి కేసీఆర్‌కు వెంకట్రామిరెడ్డి అలాగా అని అన్నారు.
"కరీంనగర్‌కు చెందిన వ్యక్తిని మెదక్ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారు. బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడానికి మెదక్ జిల్లాలో ఎవరూ లేరా? సిద్దిపేటలో మీటింగ్ పెడితే ఎవరూ రారేమోనని మా నేతలు అన్నారు. మెుట్టమెుదటిసారిగా గడీలను బద్ధలు కొట్టే అవకాశం వచ్చింది. సిద్దిపేట ప్రజలు ఎన్నో అక్రమ కేసులు ఎదుర్కొన్నారు. సిద్దిపేట పౌరుల పౌరుషాన్ని చూశాక నాకు సంపూర్ణమైన నమ్మకం కలిగింది. మెదక్ లోక్‌సభలో నీలంమధు లక్ష మెజార్టీతో గెలుస్తారు. సిద్దిపేటలో కాంగ్రెస్ అభ్యర్థికి మెజార్టీ వస్తుంది. ఒక్కో కాంగ్రెస్ కార్యకర్త వందమందితో సమానం. ప్రధాని మోదీ తెలంగాణకు గాడిదగుడ్డు ఇచ్చారు." - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
పంద్రాగస్టుకు సిద్దిపేటకు స్వాతంత్య్రం : ముదిరాజ్‌కు మంత్రి పదవి ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటేనని అన్నారు. అద్దంకి దయాకర్‌కు పెద్దపదవి ఇవ్వాలని ఆగాను, దయాకర్‌కు మంచి పదవి ఇచ్చే బాధ్యత తనది అని సీఎం రేవంత్ తెలిపారు. కొమరవెల్లి మల్లన్న సాక్షిగా పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తామని మాటిచ్చారు. సిద్దిపేట శనీశ్వరరావును పాతాళానికి తొక్కే బాధ్యత తనది అని రేవంత్ స్పష్టం చేశారు. పంద్రాగస్టు నాడు సిద్దిపేటకు స్వాతంత్య్రం రాబోతోందని చెప్పారు. హరీశ్‌రావు రాజీనామా చేశాక, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తామని పేర్కొన్నారు. ఈ ర్యాలీలో సీఎంతో పాటు మంత్రి కొండా సురేఖ, కోదండరాం, అద్దంకి దయాకర్ పాల్గొన్నారు. బ్లాక్ ఆఫీస్ చౌరస్తా నుంచి ఓల్డ్ బస్టాండ్ వరకు సీఎం రేవంత్ రెడ్డి ర్యాలీ జరిగింది.
అప్పుడు షైన్ ఇండియా - ఇప్పుడు వికసిత్ భారత్ - హిస్టరీ రిపీట్ అవుద్ది : సీఎం రేవంత్ రెడ్డి