CM Revanth Review on Malkajgiri Parliament Constituency : తనకు కొడంగల్, మల్కాజిగిరి రెండు నియోజకవర్గాలు రెండు కళ్ల లాంటివని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణించారు. కొడంగల్‌కు ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి చేస్తున్నానో, అంతే సమానంగా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్నీ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని సీఎం వెల్లడించారు. ఇవాళ జూబ్లీహిల్స్ మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం అతిథి గృహంలో జరిగిన ముఖ్య నాయకుల సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు. అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తాజా రాజకీయ పరిస్థితులపై సమీక్షించారు.
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లేందుకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇంఛార్జీలకు, ముఖ్య నాయకులకు డీసీసీ అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పది మందితో కూడిన కమిటీ వేయాలని సూచించారు. నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడి పని చేసిన నాయకులందరికీ ఏదో ఒక విధంగా పదవులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని సీఎం స్పష్టం చేశారు. పార్టీ కమిటీలతో పాటు బూత్ కమిటీలు, డివిజన్ కమిటీలు కూడా వేయాలని ఆయా అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జీలకు సూచించారు.
కాంగ్రెస్ ఎంపీ టికెట్ల కోసం పోటాపోటీ - 140 దాటిన అర్జీలు - ఆ 3 స్థానాలపై ప్రముఖుల గురి
పార్టీ కోసం పని చేసిన నాయకులకు రాష్ట్ర స్థాయి పదవులే కాకుండా జిల్లా స్థాయి పదవులు కూడా ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాల్సిందేనని స్పష్టం చేశారు. అదేవిధంగా కంటోన్మెంట్ ఉప ఎన్నికలోనూ గెలవాలని, హోలీ పండుగలోగా అధిష్టానం అభ్యర్థులను ప్రకటిస్తుందని రేవంత్ స్పష్టం చేశారు.
నేను ఈ స్థాయికి చేరానంటే ఆ గొప్పతనం మల్కాజిగిరి ప్రజలదే. మల్కాజిగిరి సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ గెలవాలి. హోలీ లోపు లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన వస్తుంది. కష్టపడిన వారిని ప్రభుత్వంలో భాగస్వాములు చేసే బాధ్యత నాది. మల్కాజిగిరి ప్రచార మోడల్, రాష్ట్రమంతా అనుసరించేలా ఉండాలి. - రేవంత్ రెడ్డి, సీఎం, టీపీసీసీ అధ్యక్షులు
ఇదిలా ఉండగా, లోక్‌సభ నియోజకవర్గాలతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంతోనే మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. వరుసగా 17 పార్లమెంట్ నియోజకవర్గాల నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి.
లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సమాయత్తమవుతున్న ప్రధాన పార్టీలు