CM Revanth Participated in MP Nomination Rally : మహబూబ్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డి నామినేషన్ వేశారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. అంతకు ముందు నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు తన ఇంటి నుంచి భారీ ర్యాలీగా వెళ్లారు. వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్న ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ర్యాలీలో మాట్లాడిన సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
![CM Revanth Participated in Mahabubnagar MP Candidate Vamshi Chand Nomination Program](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-04-2024/21264259_cm_revanth_reddy_fires_on_kcr.jpeg)
20 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని కేసీఆర్ అంటున్నారన్న ఆయన, ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్‌రెడ్డి అని గుర్తుచేశారు. మా ఎమ్మెల్యేలను టచ్‌చేస్తే, మాడి మసైపోతారని ఫైర్ అయ్యారు. పాలమూరు కోసం అనేక ప్రాజెక్టులు చేపట్టామన్న సీఎం, పదేళ్లుగా ఈ జిల్లాను గులాబీ పార్టీ ఎడారిగా మార్చిందని దుయ్యబట్టారు. ఈ పదేళ్లలో పాలమూరుకు కేసీఆర్ ఏం చేశారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
"ఈమధ్య కేటీఆర్ మాట్లాడుతూ, మా కారు కొంచెం ఖరాబు అయ్యి, గ్యారేజీకి పోయిందని అంటున్నారు. కానీ కారు రిపేర్ కాలేదు. ఏకంగా ఇంజిన్ డ్యామేజైంది. ఇంక మళ్లీ రాదు. తూకానికి అమ్మాడానికే తప్ప వినియోగించటానికి పనికిరాదు. కావాలంటే కేసీఆర్‌ను అడిగి తెలుసుకోవాలి. మీ పార్టీ కారే కాదు, కేసీఆర్ ఆరోగ్యం కూడా అంతే ఇంక సంగతులు." -రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి
CM Revanth Reddy Fires on KCR : కారు షెడ్డు నుంచి బయటకు ఇక రాదని, పూర్తిగా పాడైపోయిందని బీఆర్ఎస్ను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఏం చేశారని పాలమూరు ప్రజలు బీఆర్ఎస్కు ఓటేయాలని అడిగారు. పాలమూరు ప్రజలు కళ్లు తెరిచారన్న సీఎం, గడీ దొరలను నమ్మరని స్పష్టంచేశారు. మాదిగల వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్న రేవంత్‌రెడ్డి, అందుకోసం పార్లమెంట్, సుప్రీంకోర్టులో పోరాడతామని హామీ ఇచ్చారు.
తమ ప్రభుత్వం వచ్చి మూడు నెలలే అయినప్పటికీ, అప్పుడే ప్రతిపక్షాలు శాపనార్థాలు పెడుతున్నాయని సీఎం ఆక్షేపించారు. ప్రధాని మోదీ పదేళ్లలో పాలమూరు జిల్లాకు ఏమైనా జాతీయ హోదా ఇచ్చారా అని ప్రశ్నించారు. పాలమూరు బిడ్డ గౌరవాన్ని నిలబెట్టిన ప్రజల రుణం తీర్చుకుంటానని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో 14 లోక్‌సభ సీట్లు హస్తమే కైవసం చేసుకోవాలని, మహబూబ్‌నగర్‌లో భారీ మెజార్టీతో వంశీచంద్‌కు ఓటేసి దిల్లీ పంపించి, నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేయాలని ప్రజలను రేవంత్ కోరారు.