CM Revanth Reddy on Job Recruitment in Telangana : ప్రిలిమ్స్‌లో విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు స్పష్టమైన లక్ష్యంతో సివిల్స్‌లో విజయం సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాజీవ్ సివిల్స్ అభయహస్తం పథకంలో సింగరేణి కాలరీస్ ఇస్తున్న లక్ష రూపాయల చెక్కులను 135 మందికి సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణులై ఇంటర్వ్యూకి అర్హత సాధిస్తే మరో లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేయనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామని, గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, డీఎస్సీతో కలిపి మరో 35 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చి తమ చిత్తశుద్ధిని చాటుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూల్స్ : గత ప్రభుత్వం తెలంగాణలో విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించిన సీఎం రేవంత్ రెడ్డి వసతి గృహాలను అద్దె భవనాల్లో నిర్వహించారని వందల మంది విద్యార్థులు ఉంటే ఒకట్రెండు బాత్‌రూంలతో సరి పెట్టారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం వంద నియోజకవర్గాల్లో రూ. 5 వేల కోట్ల రూపాయలతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వసతిగృహాలన్నీ ఒకే కాంపౌండ్‌లో ఉండేలా 20 నుంచి 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూల్స్ పేరుతో నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
కేంబ్రిడ్జి, ఆక్స్‌ఫర్డ్, ఉస్మానియాలో చదువుకున్నామని గర్వంగా చెప్పుకున్నట్లే భవిష్యత్తులో తాము ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో చదువుకున్నామని విద్యార్థులు చెప్పుకునేలా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి వెల్లడించారు.మన విద్య సర్టిఫికెట్లకే పరిమితమవుతోందని వేలాది మంది ఇంజినీరింగ్ విద్య పూర్తి చేసినా కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలు వారిలో ఉండడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
20 వేల మందికి స్కిల్యూనివర్సిటీ శిక్షణ : మరోవైపు అవసరమైన నైపుణ్యం ఉన్న వారు లభించక కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. నిరుద్యోగ సమస్య నిర్మూలనకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించి దానికి పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రను ఛైర్మన్‌గా, శ్రీనివాసరాజును వైస్ ఛైర్మన్‌గా నియమించినట్లు సీఎం తెలిపారు. ఈ విద్యా సంవత్సరం 2 వేల మందికి శిక్షణ ప్రారంభిస్తున్నామని వచ్చే ఏడాది నుంచి 20 వేల మందికి యూనివర్సిటీ శిక్షణ ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
పతకాలు సాధించేలా యంగ్ ఇండియా స్పోర్ట్స్ : ఒలింపిక్స్‌లో చిన్న చిన్న దేశాలు పదుల సంఖ్యలో పతకాలు సాధిస్తే 140 కోట్ల జనాభా ఉన్న మన దేశం మాత్రం ఆశించిన స్థాయిలో పతకాలు సాధించలేదని ఇది ఒక రకంగా మనకు అవమానకరమేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాబోయే ఒలింపిక్స్‌లో మన యువత పెద్ద సంఖ్యలో పతకాలు సాధించేలా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి రూపకల్పన చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
విద్యా రంగానికి తాము ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ కొందరు కుట్రలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తుంటే పరీక్షలు వాయిదా వేయించాలంటూ విద్యార్థులతో ఆందోళనలు చేయిస్తున్నారని సీఎం మండిపడ్డారు. పోటీ పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి నష్టం ఉండదని వాటికి ప్రిపేరయ్యే విద్యార్థులు నష్టపోతారన్నారు.
ప్రజలకు అన్నగా అండగా నిలబడతా : గతంలో విద్యార్థులను రెచ్చగొట్టి ప్రాణాలు తీసి రాజకీయ లబ్ధి పొంది అధికారంలోకి వచ్చారని మండిపడ్డ ముఖ్యమంత్రి పదేళ్ల పాటు ఉద్యోగ కల్పన పట్టించుకోకుండా తమ ఉద్యోగాలు పోగానే మళ్లీ విద్యార్థులను రెచ్చగొట్టుతున్నారన్నారు. పది, పదిహేను రోజుల్లోనే రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు, ఫ్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకం చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. విద్యార్థుల, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని, ప్రజలకు అన్నగా అండగా నిలబడతానని సీఎం అన్నారు. కొందరి మాయమాటల ప్రభావంతో నిరసనలు, ధర్నాలకు దిగొద్దని కుట్రలకు పావులుగా మారొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఎవరు ఏం చెబుతున్నారు ఎవరేం చేస్తున్నారనో సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో సివిల్స్‌లో ఎంపికై రాష్ట్ర ప్రతిష్టను పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. తమ ప్రభుత్వ ప్రాధాన్యం విద్యా, ఉద్యోగాలు, వ్యవసాయం, రైతుసంక్షేమం అయితే గత ప్రభుత్వంలోని వారికి ఫాంహౌస్‌లు సంపాదన అని సీఎం విమర్శించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు రఘురాంరెడ్డి, గడ్డం వంశీ, సింగరేణి సీఎండీ బలరాం, సీఎస్ శాంతి కుమారి, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల ఉద్యమం వల్లే ప్రత్యేక తెలంగాణ వచ్చింది. నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కృషి చేస్తున్నాం. 90 రోజుల్లో 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశాం. మరో 35 వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయబోతున్నాం. రాష్ట్రం నుంచి అత్యధికంగా సివిల్ సర్వెంట్లు రావాలని ఆశిస్తున్నాం. నైపుణ్యాలు లేకపోవడం వల్ల నిరుద్యోగం పట్టిపీడిస్తుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి యంగ్ ఇండియా వర్సిటీలో ఏటా 20 వేల మందికి శిక్షణ ఇస్తాం. - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
'వచ్చే విద్యా సంవత్సరానికి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ' - CM REVANTH ON SPORTS UNIVERSITY