CM Revanth On Medigadda Project Safety Works : జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించిన రక్షణ చర్యలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిల్ల ఆనకట్టలకు సంబంధించి ఎన్డీఎస్ఏ కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలోని అంశాలపై సమావేశంలో చర్చించారు. ఆనకట్టలు మరింతగా దెబ్బతినకుండా చేపట్టాల్సిన రక్షణ చర్యల విషయమై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది.
NDSA On Medigadda Works : ఇప్పటికే నిర్మాణ సంస్థలు అక్కడ సంబంధిత పనులను చేపట్టినట్లు అధికారులు, ఈఎన్సీలు సమావేశంలో వివరించారు. వర్షాకాలం సమీపించిన తరుణంలో తదుపరి దెబ్బతినకుండా తగిన రక్షణ చర్యలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులు, ఇంజనీర్లకు సూచించినట్లు సమాచారం. ఎన్డీఎస్ఏ కమిటీ తదుపరి పలు పరీక్షలు కూడా నిర్వహించాలని సూచించింది.
ఎన్జీఆర్ఐ, సీడబ్ల్యూపీఆర్ఎస్ తదితర సంస్థల ద్వారా పరీక్షలు వివిధ పరీక్షలు కూడా చేయాలని తెలిపింది. వాటికి సంబంధించి కూడా కార్యాచరణపై కూడా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. అన్ని అంశాలకు సంబంధించి సమగ్ర నివేదిక రూపొందించి ఇవ్వాలని నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్‌ను ఆదేశించారు. నివేదిక సిద్ధమ్యాయక సీఎం రేవంత్ రెడ్డి వారం రోజుల్లో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు.మంత్రివర్గ సమావేశంలో అన్ని అంశాలపై మరింత లోతుగా చర్చించాలని నిర్ణయించారు.
కాగా కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ చర్యలను అధికారులు చేపట్టారు. గత సంవత్సరం అక్టోబర్ 21న 7వ బ్లాక్‌లోని 20వ పిల్లర్ దెబ్బతిని, పియర్‌లో పగుళ్లు, ఆనకట్టపై వంతెన కుంగిపోవడంతో ప్రమాదం ఏర్పడింది. ఈ క్రమంలో బ్యారేజీకి మరింత ప్రమాదం జరగకుండా ముందస్తుగా నీటిని విడుదల చేసి, ఖాళీ చేశారు. మరోవైపు జాతీయ డ్యాం సేఫ్టీ అధారిటీ నిపుణుల బృందం కమిటీ పలుమార్లు మేడిగడ్డను పరిశీలించి, పలు పరీక్షలు చేసి ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇచ్చింది.