CM Revanth Road Show at Ambarpet : మోదీ గ్యారంటీలకు వారంటీ అయిపోయిందని, బీఆర్ఎస్ పార్టీ చెల్లని రూపాయిగా మారిందని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని అంబర్‌పేట తిలక్‌నగర్ నుంచి ఫీవర్ ఆసుపత్రి వరకు కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్‌కు మద్దతుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించారు. అశేష జనసందోహం మధ్య జై కాంగ్రెస్ నినాదాలతో కార్యక్రమం హోరెత్తింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం, ప్రత్యర్థి పార్టీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
దానం నాగేందర్‌ను లక్ష మెజారిటీతో గెలిపిస్తే కేంద్రమంత్రిని చేస్తా : గత కాంగ్రెస్ పాలనలోనే హైదరాబాద్‌లో ఔటర్ రింగ్ రోడ్డు, ఫార్మా పరిశ్రమలు వచ్చాయని తెలిపారు. గతంలోనే హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి జలాలు తీసుకొచ్చామని చెప్పారు. మెట్రో రైలు కూడా రావడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని రేవంత్‌రెడ్డి వివరించారు. అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటలోనే బతుకమ్మ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. దానం నాగేందర్‌ను లక్ష మెజారిటీతో గెలిపిస్తే కేంద్రమంత్రిని చేస్తానని సీఎం ప్రకటించారు.
"మోదీ గ్యారంటీకి వారంటీ అయిపోయింది. ఎందుకంటే ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలిస్తానని, పదేళ్లలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఇవాళ ప్రపంచంలోనే అత్యధిక నిరుద్యోగ సమస్య ఉన్నది మన దేశంలోనే. ఇదేకాదు ప్రపంచంలో ఉన్న 195 దేశాల్లో ఆకలి సూచీ ప్రకారం చూస్తే ఇండియానే 111వ దేశంగా ఉంది."-రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి
PCC Chief Revanth Comments on Kishan Reddy : మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి ఉన్నా, అంబర్పేట్ నియోజకవర్గం అభివృద్ది చెందలేదని, కనీసం ఇక్కడ వంతెన కూడా నిర్మించలేదని దుయ్యబట్టారు. నగరం అభివృద్ధి జరగాలంటే దానం నాగేందర్‌ను గెలిపించాలని, మోదీ గ్యారంటీకి వారంటీ అయిపోయిందని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు చెప్పే మాటలకు అర్థం లేదన్న రేవంత్‌రెడ్డి, కేటీఆర్ చీర కట్టుకొని ఆర్టీసీ బస్సు ఎక్కితే ప్రభుత్వ పథకాల అమలు తీరు తెలుస్తాదని ఎద్దేవా చేశారు.
బలహీన వర్గాల కోసం ఈటల ఏం చేశారు : మరోవైపు మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్‌రెడ్డికి మద్దతుగా ఉప్పల్‌లో నిర్వహించిన రోడ్ షోలో రేవంత్ ప్రసంగించారు. గతంలో మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ బలహీనవర్గాల కోసం ఏమైనా చేశారా? అని ప్రశ్నించారు. పంపకాల్లో కేసీఆర్‌తో తేడా వచ్చినందుకే రాజేందర్ గులాబీ పార్టీ నుంచి బయటకు వచ్చారని విమర్శించారు. అంతేతప్ప ప్రజల కోసం కాదని ఆరోపించారు.
ఉప్పల్‌లో పనులు నిలిచిపోయిన పైవంతెనల గురించి కేంద్రాన్ని ఎప్పుడైనా ఈటల అడిగారా అని నిలదీశారు. కరోనా సమయంలో సీఎస్‌ఆర్ నిధులు దోచుకుతింటుంటే నోరెత్తలేదని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ చూస్తోందని, మరి అటువంటి పార్టీవైపు ఈటల ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. అనంతరం కంటోన్మెంట్ కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీలోనే లేదని వ్యాఖ్యానించారు.
CM Revanth Reddy in Cantonment Corner Meeting : కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తేనే ఇంటి పన్ను, నీటి సమస్య, కంటోన్మెంట్ భూముల సమస్యతో పాటు ఇళ్ల పట్టాల సమస్య తీరుతుందన్నారు. కాంగ్రెస్ శ్రేణుల ఉత్సాహం ఈనెల 13 వరకు ఇలాగే కొనసాగాలని, మల్కాజ్గిరి ఎంపీగా పట్నం సునీతా మహేందర్ రెడ్డిని, కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా శ్రీ గణేశ్‌ను గెలిపించాలని కోరారు.
షెడ్డుకు పోయిన కారును తూకానికి అమ్మాల్సిందే : సీఎం రేవంత్‌రెడ్డి - Congress janajathara sabha gadwal