CM Revanth Jana Jatara Sabha in Narayanapet : మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా డీకే అరుణ ఓడిపోతే, పాలమూరు జిల్లాకు వచ్చే నష్టమేమీ లేదని నారాయణపేట జిల్లా మక్తల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి గెలిస్తేనే ఈ జిల్లాలోని సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. పాలమూరు దోపిడీకి పాల్పడ్డ బీఆర్ఎస్కు, ఇక్కడి అభివృద్ధిని ఓర్వని బీజేపీకి ఓటుతో గుణపాఠం చెప్పాలని జనజాతర సభలో ప్రజలకు పిలుపునిచ్చారు.
మత రాజకీయాలు చేసే కమలానికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి : రాష్ట్రంలో బీజేపీకి ఓటు వేస్తే, తెలంగాణకు కూడా పెట్టుబడులు ఆగిపోతాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఏ రాష్ట్రంలోనైనా మత కలహాలు ఉంటే పరిశ్రమలు రావని, ఉపాధి అవకాశాలు పెరగవని అన్నారు. మతం పేరుతో మాత్రమే రాజకీయాలు చేసే కమలానికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేట జిల్లా మక్తల్‌లో ఏర్పాటు చేసిన జనజాతర సభలో బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
"జెండాలకు, అజెండాలకు అతీతంగా రాజకీయాలకు దూరంగా ఈ జిల్లాను అభివృద్ధి చేసుకోవడానికి ఏకం కావాల్సిన సందర్భంలో ఎట్లైనా కాంగ్రెస్‌ను ఓడగొట్టాలని డీకే అరుణమ్మ దిల్లీ సుల్తానుల పంచన చేరారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారు. ఇదే సభా వేదికగా నేనొకటి అడుగుతున్నా, మీరు ఒకసారి ఎంపీ కాకుంటే రాష్ట్రానికి వచ్చే నష్టం లేదు, పాలమూరుకు వచ్చే కష్టం లేదు."- రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
CM Revanth Comments on DK Aruna : బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణమ్మ ఉండి కూడా ఈ జిల్లాకు ఏం తెచ్చారని, పదేళ్లుగా పాలమూరు జిల్లా ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చారా అని సీఎం ప్రశ్నించారు. కమలానికి ఈసారి ఓటు వేస్తే, రిజర్వేషన్ల రద్దుకు తీర్పు ఇచ్చినట్లేనని, మత విద్వేషాలను ప్రోత్సహించినట్లేనని సీఎం దుయ్యబట్టారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు సంస్థలు, పెట్టుబడులు రావటం ఎప్పుడైనా చూశామా అన్న ఆయన, నిత్యం మతకలహాల వల్ల యూపీకి ఎలాంటి పెట్టుబడులు రావటం లేదని తెలిపారు. బీజేపీ ప్రభావం లేని గుర్‌గ్రామ్‌కు ఎన్నో పరిశ్రమలు వచ్చాయని పేర్కొన్నారు.
బీజేపీకి ఓటు వేస్తే 100 సంవత్సరాల వెనక్కు పోతామని సీఎం హెచ్చరించారు. కమలం పార్టీ రాజ్యాంగాన్ని మారుస్తామని అంటుందని, ఆ పార్టీని గెలిపించినట్లు అయితే ఉద్యోగ అవకాశాలు రావని విమర్శించారు. బంగ్లా రాజకీయాలను, బంగ్లా చీకటి ఒప్పందాలను అధికారంలోకి రానివ్వకూడదన్న రేవంత్‌రెడ్డి, 70 సంవత్సరాల నుంచి ఎందరికో ఓటు వేశామని, ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మీ బిడ్డ వంశీచంద్‌ను గెలిపించాలని కోరారు.
ఓటు బీజేపీకి వేసినా, బీఆర్ఎస్కు వేసినా ఒక్కటే : సీఎం రేవంత్ - CM REVANTH CORNER MEETING