CM Revanth Reddy Road Show in Badangpet : రిజర్వేషన్లు రద్దు కావొద్దని మాట్లాడితే తనను అరెస్టు చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దిల్లీ పోలీసులను తనపైకి పంపారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ భారతీయ జనతా పార్టీ గెలిస్తే, ప్రమాదం పొంచి ఉందన్న ఆయన ఆ పార్టీని ఓడిస్తేనే రిజర్వేషన్లు కొనసాగుతాయన్నారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని బడంగ్‌పేటలో సీఎం రేవంత్‌రెడ్డి రోడ్ షో నిర్వహించారు. అనంతరం కొత్తపేటలో ప్రచారం చేస్తూ, చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డికి మద్దతుగా నిలిచారు. రోడ్ షోలో మాట్లాడిన రేవంత్‌రెడ్డి, కేసీఆర్ సహా ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పాటును పార్లమెంటులో అవమానించడం మినహా, ప్రధాని మోదీ తెలంగాణకు ఇచ్చిందేమీ లేదన్నారు. ఆయన తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డేనంటూ రేవంత్ ఓ గుడ్డును ప్రదర్శించారు.
"మీ కారు ఖరాబు కాదు ఏకంగా కార్ఖానాకు పోయింది. ఇంకా అది తిరిగి రాదు. ఆ విషయం కేటీఆర్‌కు తెలవకున్నా కేసీఆర్‌కు తెలుసు. అందుకే మాజీముఖ్యమంత్రి నిన్న, మొన్న బస్సు వేసుకొని ప్రచారాలకు వెళ్లారు. పదేళ్ల వారి పాలనలో ఏమి చేసారో చెప్పటంలేదు కానీ ఎంతసేపు నన్ను దిగిపో అంటున్నారు."-రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి
Revanth Reddy Comments on Modi, KCR : గుజరాత్ రాష్ట్రానికి మాత్రం బంగారు గుడ్డు ఇస్తున్న బీజేపీ, మనకు మాత్రం గాడిద గుడ్డు మిగిల్చుతుందని ఆరోపించారు. డిసెంబర్‌లో జరిగిన సెమీఫైనల్స్ మాదిరి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచామని, అందులో గులాబీని ఓడించి ఫైనల్స్‌కు వచ్చామన్నారు. అదే స్ఫూర్తితో ఫైనల్స్‌లో కాషాయ దళాన్ని ఓడించి, రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇదే క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వ్యంగ్యస్త్రాలు సంధించారు.
బీఆర్‌ఎస్ కారు కార్ఖానాకు పోయిందని, అది తిరిగి రాదని, అందుకే కేసీఆర్ బస్సు యాత్రలు చేస్తూ తీర్థయాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పదేళ్ల పాలనలో ఆయన ఏం చేశారో చెప్పకుండా, మూణ్నెళ్లలో వచ్చిన తాము మాత్రం ఏం చేయట్లేదని అంటున్నారని సీఎం ధ్వజమెత్తారు. తండ్రి పేరు చెప్పి కేటీఆర్‌లా తాను మంత్రి కాలేదని విమర్శించిన ఆయన, కేసీఆర్ జీవితంలో పదవి అనేది ఇక లేదని జోస్యం చెప్పారు.
బీజేపీతో కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నారు : బిడ్డ బెయిల్ కోసం కేసీఆర్ బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. అందుకే సోమవారం ఖమ్మం సభలో కేసీఆర్ మాట్లాడుతూ, రాబోయేది సంకీర్ణ సర్కారేనని అందులో నామ నాగేశ్వరరావు కేంద్రమంత్రిగా అవుతారని అంటున్నారని విమర్శించారు. అదేవిధంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి యూపీ లేదా బిహార్ నుంచి రాజ్యసభకు వెళ్లాలని సూచించారు. అతనికి చేవెళ్లలో ఎవరూ ఓటు వేయరని జోస్యం చెప్పారు.