CM Revanth Participated in Social Media Conglomerate : సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో సామాజిక మీడియా ముందుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సామాజిక మీడియా సమ్మేళనం సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎంత పెద్ద విషయమైనా ప్రజలకు చేర్చేదే సామాజిక మీడియాగా సీఎం అభివర్ణించారు.
ఈ సందర్భంగా క్రికెట్ ఆటలో ఏ విధంగా అయితే క్రమంగా మార్పు వచ్చిందో, ఇప్పుడు మీడియాలోనూ అలాంటి మార్పే వస్తోందన్నారు. ఇప్పుడున్న క్రికెట్ ఫార్మెట్ ముందు మాదిరి లేదని, ఇప్పట్లో సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్‌లు లాంటి పాతతరం వాళ్లు ఆడలేరన్నారు. న్యూస్ పేపర్ అంటే వార్తలను మరుసటి రోజు చదువుకునేదని, ఆ తర్వాత న్యూస్ ఛానల్స్ వచ్చినా ఉదయం నుంచి రెండు మూడు సార్లు మాత్రమే వార్తలు ప్రసారం అయ్యేవని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రతి గంటకు వార్తలు ప్రసారం చేస్తున్నాయని, ఇలా రోజురోజుకూ మార్పులు వచ్చినట్లుగా వివరించారు.
Parliament Elections 2024 : ఇప్పుడు సామాజిక మీడియా ప్రతి సెకన్‌కు వార్తలను బయటకు తెస్తుంటాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా అంటూ మూడు మీడియాలు ఉన్నాయన్న సీఎం, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి, సమాచారం అందరికీ చేరవేసేట్లు వ్యవహరించే విధానమే సామాజిక మీడియా అని చెప్పారు. ఈ విషయాన్ని సామాజిక మీడియా వారియర్లు గుర్తించి, ఉపయోగించడంతోనే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని వివరించారు. నాయకులు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా, ఆ విషయాలను ప్రజలకు చేరవేయడమే ముఖ్యమని సూచించారు.
నాయకులకు, ప్రజలకు అనుసంధాన కర్తగా సామాజిక మీడియా వ్యవహరిస్తోందని రేవంత్ రెడ్డి కితాబిచ్చారు. కేసీఆర్‌ను ఓడించడంతో సెమీ ఫైనల్‌కు చేరుకున్నామని, ఇప్పుడు మోదీని ఓడించి ఫైనల్‌లో గెలవాలని సూచించారు. ఇందుకోసం మోదీ, అమిత్ షాలు మోసపూరిత మాటలతో కాంగ్రెస్‌ను ఓడించాలని చూస్తుండటాన్ని సామాజిక మీడియా ద్వారా ఎదుర్కోవాల్సి ఉందన్నారు. ప్రజాస్వామ్యంపై, రిజర్వేషన్లపై బీజేపీ దాడులు చేస్తోందని ఆరోపించిన సీఎం, మతాన్ని అడ్డుపెట్టుకుని తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీని సోషల్ మీడియా వారియర్స్ సమయస్పూర్తితో తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.