CM Revanth Jana Jatara Sabha in Kothagudem : రైతు భరోసా, కరెంట్ కోతలు, పింఛన్లపై బీఆర్ఎస్ పార్టీ అబద్ధాలు చెబుతోందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ను అడ్డుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ కలిసి కుట్రలు చేస్తున్నాయన్న ఆయన, మోసం చేయడంలో కేసీఆర్‌ను మించినవారు లేరని దుయ్యబట్టారు. డిసెంబరు 3న వచ్చినవి సెమీఫైనల్ ఫలితాలు మాత్రమేనని, ఈ నెల 13న జరిగే ఫైనల్స్‌లో తమదే విజయమన్నారు.
గుజరాత్‌ను ఓడిద్దాం, తెలంగాణను గెలిపించుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం జనజాతర సభలో ఖమ్మం అభ్యర్థి రఘురామిరెడ్డి, మహబూబాబాద్ అభ్యర్థి బలరాం నాయక్‌లకు మద్దతుగా సీఎం ప్రచారం నిర్వహించారు. రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను కాపాడుకునేందుకు కాంగ్రెస్‌ను గెలిపించాలన్న రేవంత్‌రెడ్డి, 7 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పగించారన్నారు.
"ఈనెల తొమ్మిదో తారీఖు లోపల ఏ రైతుకైనా బకాయి ఉంటే అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తాను. ఒకవేళ అందరు రైతులకు రైతు భరోసా పధకంలో నిధులు వస్తే నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తారా అని కేసీఆర్‌కు సవాల్ చేస్తున్నాను. మరోవైపు హరీశ్‌రావు రైతు రుణమాఫీ కోసం ఎప్పుడు చేస్తానా అని గగ్గోలు పెడుతున్నారు. దానికి నేను సమాధానం చెప్పినా సవాల్ విసిరిండు, అందుకే రాజీనామా పత్రం జేబులో పెట్టుకొని సిద్ధంగా ఉండమన్నాను."-రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి
PCC Chief Revanth Fires on KCR : కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే అని కేసీఆర్ చెబుతున్నారన్న సీఎం, కేంద్రంలో బీజేపీ చేసిన అన్ని చట్టాలకూ బీఆర్ఎస్ మద్దతిచ్చిందన్నారు. కేసీఆర్, కమలం పార్టీలో చేరతారని తాను మొదట్నుంచీ చెబుతున్నట్లు వివరించారు. నక్కజిత్తుల కేసీఆర్ వైఖరిని ఖమ్మం జిల్లా ప్రజలు ముందే పసిగట్టారని, అందుకే గత మూడు పర్యాయాలుగా గులాబీ పార్టీని దూరం పెట్టారన్నారు. రాహుల్‌గాంధీని ప్రధానిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారన్న ఆయన, అత్యధిక మెజార్టీతో గెలిచే స్థానంగా ఖమ్మం నిలబడుతుందని ఆశించారు.
పదేళ్లపాటు తెలంగాణకు ద్రోహం చేసింది బీజేపీనేనన్న ముఖ్యమంత్రి, రిజర్వేషన్లు రద్దు చేసేందుకు కమల దళం ప్రణాళికలు వేస్తుందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మారుస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శే చెప్పారన్నారు. ఇప్పుడు ఎవరిని చెప్పుతో కొట్టాలో, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ నేతలు బండి సంజయ్, అర్వింద్ చెప్పాలని అన్నారు. రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను కాపాడుకునేందుకు కాంగ్రెస్‌ను గెలిపించాలని రేవంత్‌రెడ్డి కోరారు. పదేళ్లుగా మోదీ, బీజేపీ ఈ రాష్ట్రానికి గాడిదగుడ్డు మాత్రమే ఇచ్చిందని ఆయన విమర్శించారు.
రిజర్వేషన్ల రద్దు కోసమే జనగణనలో జాప్యం : సీఎం రేవంత్ - CM Revanth Jana Jatara Sabha