Former CM KCR Meeting with BRS Leaders : లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని కరీంనగర్ నుంచి ఈ నెల 12వ తేదీన పూరించాలని భారత రాష్ట్ర సమితి నిర్ణయించింది. ఉద్యమకాలం నుంచి సెంటిమెంట్‌గా కలిసి వస్తున్న కరీంనగర్ ఎస్ఆర్ఎస్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ(BRS Public Meeting) నిర్వహించాలని కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. లోక్‌సభ ఎన్నికల కార్యాచరణ, అభ్యర్థిత్వాల విషయమై కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల ముఖ్య నేతలతో ఆయన హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో విడివిడిగా సమావేశమయ్యారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సీనియర్ నేతలు హరీశ్‌రావు, వినోద్ కుమార్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సంతోష్ కుమార్, ఎల్.రమణ, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమేనన్న కేసీఆర్ శాసనసభ ఎన్నికల ఫలితాలను పట్టించుకోవద్దని, అధైర్యపడొద్దని నేతలు, కార్యకర్తలకు సూచించారు. లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వచ్చేలా నేతలంతా కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ కచ్చితంగా గెలువబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అక్కడ బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గాల్లో తాను రోడ్‌షో(Road Shows)ల్లో పాల్గొంటానని కేసీఆర్ తెలిపారు.
బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర ఖరారు
BRS Public Meeting in Karimnagar on March 12 : మండల స్థాయిలో పార్టీ సమావేశాలు పెట్టుకోవాలని నేతలకు కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు, కరెంటు ఇవ్వడం లేదని, అతి కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని, రైతులు రోడ్లు ఎక్కే పరిస్థితి వచ్చిందని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని, గులాబీ పార్టీతోనే మేలు జరుగుతుందన్న చర్చ ప్రజల్లో ప్రారంభమైందని పేర్కొన్నారు. ప్రాజెక్టుల్లో సమస్యలు రావడం సహజమేనని కేసీఆర్ అన్నారు. మధ్య మానేరులో కూడా సమస్యలు వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే మరమ్మతులు చేసినట్లు గుర్తు చేశారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు పక్కా : సమస్య వస్తే ప్రభుత్వాలు వెంటనే పూనుకొని పరిష్కరించాలి కానీ, రాజకీయం చేయడం తగదని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఒక్క పన్ను పాడైతే చికిత్స చేసుకుంటాం తప్ప మొత్తం పళ్లు పీకించుకోలేము కదా అని ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్ విషయంలో గతంలో బీఆర్ఎస్ను నిందించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ అదే చేస్తోందని, గతంలో చెప్పిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని కోరారు. 1989లో ఎన్టీఆర్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైనా 1994లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుపొందిన విషయాన్ని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో వందకు పైగా అసెంబ్లీ సీట్లలో పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎంతో మంది నాయకులను తయారు చేసిందని, అధికారంలో లేమని కొంతమంది నేతలు అటుఇటు పోవచ్చని, కేడర్ మాత్రం అలాగే ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.
కారు జస్ట్ సర్వీసింగ్‌కు వెళ్లింది - త్వరలో జెట్ స్పీడ్‌లో దూసుకొస్తుంది : కేటీఆర్