CM Jagan Election Campaign in Gudivada Constituency: జగన్ పాలనలో గుడివాడ కాస్త జూదవాడగా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు సీఎం జగన్ గుడివాడ నియోజకవర్గంలో పర్యటిస్తుండగా ఏళ్లతరబడి పేరుకుపోయిన సమస్యలపై నిలదీసేందుకు స్థానికులు సిద్ధమవుతున్నారు. గుడివాడ పట్టణానికి చారిత్రక నేపథ్యమే కాదు రాజకీయ చైతన్యమూ ఉంది. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చదువుకున్న ప్రాంతం. ఆయన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం.
ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు ఇక్కడే నడయాడారు. 1983లో టీడీపీ స్థాపించిన నాటి నుంచి 11 సార్లు ఎన్నికలు జరిగితే ఎనిమిదిసార్లు టీడీపీ విజయ కేతనం ఎగరవేసింది. ఒకే ఒక్కసారి కాంగ్రెస్ గెలుపొందగా, టీడీపీ నుంచి నాయకుడిగా ఎదిగిన కొడాలి నాని మొదట టీడీపీ తరఫున రెండుసార్లు, వైసీపీ తరఫున రెండుసార్లు గెలిచారు.
2009లో టీడీపీ తరఫున గెలిచిన ఆయన వైసీపీ గూటికి చేరారు. నాటి నుంచి గుడివాడ అరాచక శక్తులకు నిలయంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం అయిదోసారి బరిలో దిగుతున్నారు. కానీ ఆయన మంత్రిగా, వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో శాంతిభద్రతల వైఫల్యంలో, క్యాసినో పరిచయంలో, జూదగృహాల నిర్వహణకు అండదండలు, భూముల కబ్జాలు, ప్రైవేటు పంచాయితీలు, సెటిల్‌మెంట్లు, గంజాయి బ్యాచ్ ఆగడాలు ఇలా ఒకటేంటి చాలావాటికి గుడివాడ నెలవుగా మారింది.
2022 జనవరిలో కొడాలి నానికి చెందిన కె కన్వెన్షన్‌లో క్యాసినో నిర్వహించారు. సంక్రాంతి సంబరాల పేరుతో ప్రవేశ రుసుం 10 వేల రూపాయలు పెట్టారు. 5 నిమిషాల్లో వెనక్కి వచ్చేస్తే 5 వేలు, 10 నిమిషాలకు 10 వేల రూపాయలు. అంతకుమించి లోపల సమయం గడిపితే తప్పనిసరిగా క్యాసినో ఆడాల్సిందే. ఒక కౌంటర్ పెట్టారు. అక్కడ కరెన్సీ నోట్లు తీసుకుని టోకెన్లు ఇచ్చారు. అలా మూడురోజుల్లో కోట్ల రూపాయల్లో వ్యాపారం జరిగింది. క్యాబరేలు ఏర్పాటు చేసినట్లు లోపలికి వెళ్లిన వారు చెబుతుంటారు. మందు, విందు సరేసరి.
గుడివాడ అంటే ఇప్పుడు జూదవాడ అన్నట్లు మారిపోయింది. గుడివాడ నియోజకవర్గ పరిధిలోని నందివాడ, గుడివాడ శివారు ప్రాంతాల్లో ఉన్న చెరువుల్లో కొందరు గుడిసెలు ఏర్పాటు చేసి జూద గృహాలను నడుపుతున్నారు. ఇవి 365 రోజులూ నడుస్తాయి. దీనికి ఎమ్మెల్యే అండ దండలు పుష్కలం. పైకి గుడిసెల తరహాలోనే కనిపించే ఈ గృహాల లోపల ఏసీలు, బార్‌లు ఉంటాయి. ఇతర రాష్ట్రాల నుంచీ ఇక్కడికి వస్తుంటారు. ఓ కృష్ణుడు నడిపించే జూదగృహంపై కొత్తగా వచ్చిన పోలీసులు దాడి చేస్తే, 45 లక్షలు నగదు దొరికినట్లు కేసులో చూపించారు. తర్వాత అంతా మమ అయింది.
గుడివాడ పట్టణంలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది. అమ్మాయిలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. పోలీసులు సైతం గంజాయి బ్యాచ్‌కే కొమ్ము కాస్తున్నారు. గుడివాడ అంటే ఒకప్పుడు మర్యాదకు మారు పేరు. అలాంటి 'గుడి'వాడను బూతులవాడగా మార్చారు. నియోజకవర్గంలో సెటిల్‌మెంట్లు పెరిగాయి. భూముల క్రయవిక్రయాలు జరిగితే ఓ గ్యాంగ్ మధ్యలో దూరి చౌకగా కొట్టేయడం ఆనవాయితీగా మారింది. లేదంటే వివాదాల సెటిల్‌మెంట్ పేరుతో భారీగా కమీషన్లు గుంజడం 'అక్షర' సత్యం. మట్టి దందా సరేసరి. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని ఒక నేత వంద టిప్పర్లు కొనుగోలు చేశారు. అక్కడ పనులు పూర్తయ్యాక ఈ నియోజకవర్గంపై మట్టి దాడి చేశారు.