CM Chandrababu Teleconference with TDP Activists: ఆన్‌లైన్‌తోపాటు సచివాలయాల్లోనూ ఇసుక బుక్ చేసుకునే సదుపాయం త్వరలోనే కల్పిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. గ్రామస్థాయి కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉచితంగానే ఇసుకను అందిస్తున్నా విపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నది నుంచి ఇసుక తీయడానికి, సీనరేజ్, రవాణాకు మాత్రమే లబ్ధిదారులు చెల్లించాలని ఇసుక కోసం ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పనిలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని టీడీపీ శ్రేణులు ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అన్నివిధాల సహాయ సహకారాలు అందుతున్నాయన్న చంద్రబాబు జనసేన, బీజేపీతో ఇదే మైత్రీ కొనసాగించాలని శ్రేణులకు సూచించారు.
ప్రతిపక్షంలో ఉండగా నాయకులు, కార్యకర్తలు ఆర్థికంగా ఎంతో నష్టపోయారని అలాంటి వారికి తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. ఇప్పుడు సాధించిన ఈ ఘన విజయాన్ని మళ్లీ నిలబెట్టుకోవాలంటే నేతలంతా నిత్యం ప్రజల్లో తిరగాలని, వారికి అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రతిఒక్కరూ 1995 మోడల్ పరిపాలన గుర్తు చేసుకోవాలని పునరుద్ఘాటించారు. అభివృద్ధే అజెండాగా కొనసాగించుకుంటూ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలబెట్టుకోవచ్చని సూచించారు. 2019 ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన వాళ్లు 11 సీట్లకు పరిమితం అయ్యారంటే ఏ విధంగా పరిపాలించారో అర్థం చేసుకోవచ్చని అన్నరు. ప్రతిభ ఆధారంగా నామినేటెడ్ పోస్టులు భర్తీచేస్తామన్న ఆయన ఇప్పటికే ఆ ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు.
ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి: హర్ ఘర్ తిరంగాలో భాగంగా ఇంటింటా జాతీయ జెండా ఎగరాలని ఆయన పిలుపునిచ్చారు. వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్, విజన్-2047 లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయని అన్నారు. రేపు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరేసి యువత, ప్రజల్లో దేశభక్తిని పెంపొందించాలని సూచించారు. దేశాభివృద్ధిలో ప్రజల్ని భాగస్వామ్యం చేయాలన్న సీఎం అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు సమానమన్న అభిప్రాయాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. జాతీయ జెండా రూపకర్తైన పింగళి వెంకయ్య తెలుగువారు కావడం తెలుగుజాతికి గర్వకారణమన్నారు. స్వాతంత్ర్యం అనంతరం అంచలంచలుగా దేశాన్ని నాయకులు అభివృద్ధి చేసుకుంటూ వచ్చారని గుర్తుచేశారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపే అన్నక్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు.
సమస్యలపై దృష్టి: రాష్ట్రం అన్ని రకాల సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున వాటి పరిష్కారంపై ఎక్కువ దృష్టి పెట్టామని సీఎం తెలిపారు. ప్రతి శనివారం పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు, ప్రజల నుంచి వినతలు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నా అధికార పార్టీని సమర్థవంతంగా ఎదుర్కొని అధికారంలోకి వచ్చామని సీఎం గుర్తుచేశారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని మళ్లీ బాగు చేయాలనే బలమైన సంకల్పంతో ఉన్నామన్నారు. అధికారంలో ఉన్నాం కదా అని తప్పులు చేయకూడదని తేల్చిచెప్పారు. పొలిటికల్ గవర్నెన్స్‌ను దుర్వినియోగం చేస్తే ప్రజలు ఇష్టపడరని ప్రజల కోసం పనిచేస్తే చేసిన మంచి పనులే మనతో ఉంటాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.