CM Chandrababu Review Meeting with Collectors: ఏపీ బ్రాండ్‌ని దెబ్బతీసేలా గత ఐదేళ్ల పాలన సాగిందని, వైఎస్సార్సీపీ విధ్వంస పాలనతో అందరూ నష్టపోయారని కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతి సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో అధికారుల బాధ్యతలను గుర్తు చేస్తూ ప్రభుత్వ ప్రాధాన్యతలను సీఎం వివరించారు. పొలిటికల్ గవర్నెన్సే ఉంటుందని స్పష్టం చేసిన ఆయన ప్రజా సమస్యల పరిష్కారానికి వచ్చిన ఎమ్మెల్యేలను గౌరవించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఆకస్మిక తనిఖీలకు వస్తానని, అధికారులు సిద్ధంగా ఉండాలని సీఎం హెచ్చరించారు.
1995లో ఐఏఎస్‌లను డ్రైన్లలోకి దింపానన్న ఆయన నాటి విషయాలను సీఎం గుర్తు చేశారు. నిబంధనలతోపాటు మానవత్వ కోణంలో పని చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఏపీ విజన్ డాక్యుమెంట్ 2047ను అక్టోబర్ 2న విడుదల చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయిలోనూ విజన్ డాక్యుమెంట్ రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు. సెప్టెంబరు 20 తేదీనాటికి వంద రోజుల పాలన పూర్తి అవుతుందన్నారు. రాష్ట్రంలో అధికారులంతా ఇన్నోవేటివ్‌గా పనిచేయాల్సి ఉందని, థింక్ గ్లోబల్లీ అన్న నినాదంతో పనిచేయాలని సీఎం సూచించారు. దీంతోపాటు ఫేక్ ప్రచారాలను కౌంటర్ చేయాలని కలెక్టర్లు, అధికారులకు సూచించిన ఆయన రాష్ట్ర పునర్నిర్మాణంలో కలెక్టర్లదే కీలక బాధ్యత అని అన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా అధికారులంతా ముందుకెళ్లాల్సిన అవసరముందని స్పష్టం చేశారు.
ఒకప్పుడు ఆంధ్రా అధికారులంటే దిల్లీలో ఒక గౌరవం ఉండేదన్న చంద్రబాబు, ఇప్పుడు చులకన భావం కలిగే పరిస్థితిని తీసుకొచ్చారని మండిపడ్డారు. మనం తీసుకునే నిర్ణయాల వల్ల వ్యవస్థలే మారే పరిస్థితి ఉంటుందని కలెక్టర్లతో అన్నారు. ఈ నేపథ్యంలో మంచి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కలెక్టర్ల సదస్సు చరిత్ర తిరగరాయబోతోందన్న ఆయన, మనమంతా కష్టపడితే 2047 నాటికి ప్రపంచంలోనే మనం నంబర్ వన్‌గా ఉంటామన్నారు. ప్రజావేదికలో ఆనాటి సీఎం కలెక్టర్ల సదస్సు పెట్టి కూలగొట్టేశారని మండిపడ్డారు. విధ్వంసంతో పాటు పనిచేసే అధికారులను పక్కనబెట్టారు, బ్లాక్ మెయిల్ చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు.
కలెక్టర్ల సదస్సు నుంచే రాష్ట్ర అభివృద్ధికి నాంది పలకాలని స్పష్టం చేశారు. ప్రతీ నెలా 1 తేదీన పేదల సేవలో కార్యక్రమంతో అధికారులు ప్రజలతో మమేకం కావాలన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో ఐఎఎస్‌ల వ్యవస్థను దిగజార్చేలా పాలన సాగిందని సీఎం వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ పాలన వల్ల దిల్లీలోనూ ఏపీ ఐఎఎస్‌లను అంటరానివారుగా చూశారంటూ సీఎం వ్యాఖ్యానించారు. ఒకప్పుడు ఏపీ అధికారులంటే ఎంతో గౌరవం ఉండేదని, చాలా కీలక పదవుల్లోకీ పనిచేశారని చంద్రబాబు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్ర పునర్నిర్మాణంలో కలెక్టర్లదే కీలక బాధ్యతని ముఖ్యమంత్రి అన్నారు.
రాష్ట్ర విభజన కంటే 2019-24 మధ్యలోనే రాష్ట్రం ఎక్కువ నష్టపోయిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. గత ఐదేళ్ల విధ్వంసంపై 7 శ్వేతపత్రాలు విడుదల చేశామని ముఖ్యమంత్రి అన్నారు. మొత్తం 10 లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారని, భూ కబ్జాలపైనే ప్రజల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. రికార్డులు ఏవి చూసినా అన్నీ అనుమానంతోనే చూడాల్సి వస్తోందని సీఎం వ్యాఖ్యానించారు. అందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేశామని, సర్వేను కూడా నిలుపుదల చేశామన్నారు.
ఇంట్లో వినియోగించుకునే గ్రానైట్ రాయిని పునాది రాళ్లుగా వేసే ప్రయత్నం చేశారన్నారు. తరతరాలుగా వచ్చిన ఆస్తి పత్రాలపై సొంత ఫోటోను వేసుకున్నారన్నారు. సంక్షేమాన్ని చిత్తశుద్ధితో అమలు చేసే ప్రయత్నం చేస్తున్నామని సీఎం తెలిపారు. పీ4 విధానాన్ని అమలు చేసేలా కృషి చేస్తున్నామని అన్నారు. వినూత్నమైన ఆలోచనలు చేయాలని దీన్ని కలెక్టర్లు, ప్రభుత్వ శాఖలూ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏడాదికి 33 వేల కోట్లతో పేదవాళ్లకు పెన్షన్ల రూపేణా ఇస్తున్నామన్నారు. గతం ప్రభుత్వంలో బటన్ నొక్కి 2.71 లక్షల కోట్లను ఇచ్చినట్టు చెప్పుకున్నారు కానీ ప్రజలకు మేలు చేసిందెక్కడని ప్రశ్నించారు. 14 లక్షల మంది అత్యంత నిరుపేదలు ఉన్నారని వారిని పేదరికం నుంచి బయట పడేయాలని, అదే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం చేపట్టే ప్రతీ కార్యక్రమాన్ని సొంతం చేసుకోవాలని సీఎం సూచించారు. రియల్ టైమ్‌లో గవర్నెన్సుకు అవకాశం ఉండేలా యాప్‌లను వినియోగించుకోవాలని అన్నారు. వర్చువల్ గవర్నెన్సు రావాల్సి ఉందని సీఎం అన్నారు. విజిబుల్, ఇన్విజిబుల్ పోలీసింగ్ ఉండాలని అన్నారు. సరళమైన ప్రభుత్వం, మెరుగైన పాలన ఉండాలన్నారు. పర్యటనలకు వెళ్లినప్పుడు చెట్లు నరికివేత, పరదాలు కట్టడం, పాఠశాలలు మూసివేత, రెడ్ కార్పెట్లు వేయడం వంటివి చేయొద్దని ముఖ్యమంత్రి సూచించారు. ప్రజలకు సేవ చేయడంలో ఎలాంటి అసౌకర్యం కల్పించొద్దన్నారు.
వైఎస్సార్సీపీ 'స్మార్ట్' అక్రమాలపై ఆడిట్ - అడ్డగోలు చెల్లింపులపై ఆరా - YSRCP Smart Meters Scam
Pawan Comments: అంతకుముందు మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యవస్థలను కాపాడాలనే ఉద్దేశంతోనే కష్టాలు ఎదుర్కొని నిలబడ్డామని అన్నారు. వ్యవస్థలను గత ప్రభుత్వం ఆటబొమ్మలుగా మార్చిందని వ్యాఖ్యానించారు. కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న పవన్ కల్యాణ్ ప్రజలు పాలకులపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేయాలన్నారు. పాలన ఎలా ఉండకూడదో గత ఐదేళ్ల పాలన తెలియజేసింద్న పవన్ చంద్రబాబు నుంచి పాలనా అనుభవం నేర్చుకొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేవిధంగా పని చేయాలని కలెక్టర్లకు పవన్ దిశానిర్దేశం చేశారు.
Minister Anagani Comments: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్లో 80 శాతం రెవెన్యూ సమస్యలేనని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. చట్టానికి లోబడి అధికారులంతా పనిచేయాలని కలెక్టర్లకు సూచించారు. గత పాలకులు స్వార్థం కోసం ఎన్నో అరాచకాలు చేశారని అనగాని ధ్వజమెత్తారు. హక్కులన్నీ నిర్వీర్యం చేసేలా తెచ్చిన ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేశామని వివరించారు. ఈ నెలలోనే అన్న క్యాంటీన్లను పునరుద్ధరించబోతున్నామని మంత్రి సత్యప్రసాద్ తెలిపారు.
CS Neerabh Kumar Comments: కలెక్టర్లను ఉద్దేశించి మాట్లాడిన సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ రాష్ట్ర పునర్‌నిర్మాణంలో కలెక్టర్లందరూ భాగస్వాములు కావాలని కోరారు. కొత్త సర్కార్ ఏర్పడిన తరువాత జరుగుతున్న మొదటి సమావేశంలో వంద రోజు ప్రణాళిక ఆవశ్యకతను వివరించారు. ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల భరోసా కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసిన కలెక్టర్లు, అధికారులందరికీ అభినందనలు తెలిపారు. అన్ని ప్రభుత్వ పథకాల అమలులోనూ ఇదే పంథా కొనసాగిద్దామని ఆకాంక్షించారు.