CM Chandrababu Naidu Comments on YS Jagan: రాష్ట్రంలో ఎవరు హింసాకాండకు పాల్పడ్డా ఉక్కుపాదంతో అణచివేస్తామని, శాంతి భద్రతల్ని కాపాడడంలో రాజీ పడబోమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. శాంతి భద్రతల్ని స్వయంగా తానే పర్యవేక్షిస్తానని తెలిపారు. ప్రజలు పూర్తిగా తిరస్కరించినా పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రవర్తనలో మార్పు రాలేదని, ఉనికి చాటుకోవడానికే హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
తప్పుడు ప్రచారాన్ని వెంటనే తిప్పికొట్టాలి: రాష్ట్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చాక 36 మందిని హత్య చేశారంటూ జగన్ తప్పుడు ప్రచారం చేస్తుంటే, మంత్రులు, తెలుగుదేశం నాయకులు గట్టిగా తిప్పికొట్టకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆ 36 మంది పేర్లు, వివరాలు బైటపెట్టాలని గట్టిగా ఎందుకు నిలదీయడం లేదని మంత్రులు, ఎంపీలను ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో రాజీలేదని, పోలీసులు కఠినంగా వ్యవహరించాలని తేల్చి చెప్పారు. తెలుగుదేశం కార్యకర్తలు తప్పు చేసినా ఉపేక్షించొద్దని స్పష్టం చేశారు. హోం మంత్రి అనిత మరింత చురుగ్గా పనిచేయాలని, వైసీపీ తప్పుడు ప్రచారాన్ని వెంటనే తిప్పికొట్టాలని ఆయన ఆదేశించారు.
పోలీసు అధికారులు వెంటనే స్పందించకపోతే సస్పెండ్ చేయడానికైనా వెనుకాడొద్దని చంద్రబాబు అన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో గంజాయి, డ్రగ్స్, నకిలీ మద్యంపై అదుపు లేకపోవడం వల్ల రాష్ట్రంలో నేరాల రేటు పెరిగిందని తెలిపారు. త్వరలోనే పూర్తిగా నియంత్రిస్తామని స్పష్టంచేశారు. తెలుగుదేశం హయాంలో శాంతిభద్రతల నిర్వహణ అత్యుత్తమంగా ఉంటుందన్న పేరుందని గుర్తుచేశారు. దాన్ని దెబ్బతీయడానికి ఎవరు ప్రయత్నించినా సహించనని తేల్చిచెప్పారు. మత ఘర్షణలు, ఫ్యాక్షన్, నక్సలిజం, రౌడీయిజాన్ని నియంత్రించిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వానిదన్నారు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మరని ధీమా వ్యక్తం చేశారు. కానీ అప్రమత్తంగా ఉండాలని ఎంపీలు, మంత్రులకు సూచించారు.
వైఎస్సార్సీపీ నీచ రాజకీయాలు చేస్తోంది: జగన్ ఫేక్ పాలిటిక్స్‌ను నమ్ముకున్నారని, తెలుగుదేశం హింసా రాజకీయాలకు పాల్పడుతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ‘పల్నాడు జిల్లా వినుకొండలో వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యకు జగన్ రాజకీయ రంగు పులుముతున్నారని దుయ్యబట్టారు. హతుడికి, హంతకుడికి మధ్య వ్యక్తిగత గొడవలున్నాయని వైసీపీ నాయకులే అంగీకరించారని గుర్తుచేశారు. పోలీసుల విచారణలోనూ అదే స్పష్టమైందన్నారు. అయినా వైఎస్సార్సీపీ నీచ రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. జగన్ తీరు దొంగే దొంగ అన్నట్టుగా ఉందన్నారు. శాసనసభ సమావేశాలకు హాజరవకుండా ఉండేందుకే దిల్లీలో ధర్నా పేరుతో ఆయన డ్రామా చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
తప్పుడు ప్రచారంతో జగన్ మళ్లీ ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారని ఆక్షేపించారు. వాళ్ల కుట్రల్ని సాగనివ్వమని తేల్చిచెప్పారు. వినుకొండ హత్య అత్యంత కిరాతకమన్న చంద్రబాబు, నిందితుల్ని వదిలేది లేదని హెచ్చరించారు. నేరస్తులు రాజకీయ ముసుగులో తప్పులు చేసి తప్పించుకుంటామంటే కుదరదని తేల్చిచెప్పారు. గత ప్రభుత్వం వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడంతో నేరసంస్కృతి వారసత్వంగా కొనసాగుతోందని అభిప్రాయపడ్డారు. ఎవరు హింసాకాండకు పాల్పడ్డా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. తప్పు చేస్తే తప్పించుకోలేమన్న భయం కల్పిస్తామన్నారు. శాంతిభద్రతల కంటే తనకేదీ ముఖ్యం కాదని స్పష్టం చేశారు.
నేరం చేయాలంటేనే భయపడేలా చేస్తాం: టీడీపీ నాయకులు, కార్యకర్తలు హింసాత్మక ఘటనలకు దూరంగా ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మనపై తప్పుడు కేసులు పెట్టడంతో పాటు జైళ్లకు పంపిందని గుర్తుచేశారు. అందరిలో కసి, కోపం ఉన్నాయన్న సీఎం, దానికి కక్ష తీర్చుకోవాలనుకోవద్దని హితవు పలికారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో అప్రమత్తంగా ఉంటూ, ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చూడాలన్నారు. దాడులకు పాల్పడితే ఎవరినైనా వదిలేది లేదని తేల్చిచెప్పారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే అంగీకరించనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో హింస అన్నదే కనపడకూడదన్నారు. ప్రభుత్వం మారింది కాబట్టి, తీరు మార్చుకోకపోతే కష్టమని రౌడీలు, నేరస్తుల్ని హెచ్చరించారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే తీవ్ర చర్యలుంటాయని తేల్చిచెప్పారు. నేరం చేయాలంటేనే భయపడేలా చేస్తామని హెచ్చరించారు.
ఫేక్ పాలిటిక్స్ బ్రాండ్ అంబాసిడర్ జగన్ - ధ్వజమెత్తిన టీడీపీ శ్రేణులు - jagan fake publicity