CM Chandrababu Delhi Tour : ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి చంద్రబాబు నాయుడు ఇవాళ రాత్రి దిల్లీకి వెళ్లనున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలపై గురువారం ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులతో చర్చలు జరపనున్నట్లు తెలిసింది. త్వరలో కేంద్రం ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు, కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి గతంలో రావాల్సిన నిధులు, కొత్తగా తెచ్చుకోవాల్సిన పథకాలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు చర్చించే అవకాశాలు ఉన్నాయి.
పోలవరం, రాజధాని అమరావతి నగర నిర్మాణం సహా రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు తదితర అంశాలపై కేంద్రంలోని ఎన్డీఏ నాయకులతో చంద్రబాబు చర్చించనున్నారు. గత ఐదేళ్లలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు, కేంద్రం అందించాల్సిన సహాయ, సహకారాలపై ఇప్పటికే మంత్రులతో చర్చించారు. ఆయా అంశాలపై అధికారుల నుంచి సమాచారం సేకరించారు.
ఢిల్లీ పర్యటనలో ప్రస్తావించాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో సమీక్షించారు. రాష్ట్రానికి కీలక ప్రాజెక్టులు, నిధుల సమీకరణ, పెండింగ్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీఎం ఢిల్లీ పర్యటన కొనసాగనుంది. కేంద్రం నుంచి ఏ ఏ పథకాలు, ప్రాజెక్టుల ద్వారా నిధులు రాబట్టొచ్చనే అంశంపై చర్చించారు. మౌలిక వసతులకు వీలైనన్ని నిధుల రాబట్టేలా రిప్రజెంటేషన్లు సిద్దం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఢిల్లీ పెద్దలకు పూర్తిగా వివరించేలా ప్రభుత్వ నివేదికలు వుండనున్నాయి. గత ఐదేళ్ల కాలంలో వ్యవస్థల విధ్వంసం వల్ల ఏపీ ఏ విధంగా నష్టపోయిందోననే అంశాన్ని ప్రధాని సహా కేంద్ర మంత్రులకు సీఎం వివరించనున్నారు.
ఏపీకి పారిశ్రామిక రాయితీలను కల్పించాలని ముఖ్యమంత్రి కోరనున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రోత్సాహం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకారం అందివ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్రంలో అత్యవసరంగా చేపట్టాల్సిన రోడ్లు, పోలవరం, ఆర్థిక సాయం వంటి అంశాలే లక్ష్యంగా కేంద్ర మంత్రులను కలవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. డిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, వివిధ కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. నిర్మలా సీతారామన్, గడ్కరి, నడ్డా, సీఆర్ పాటిల్ వంటి కేంద్ర మంత్రులతో చంద్రబాబు, ఏపీ మంత్రులు భేటీ కానున్నారు. చంద్రబాబు వెంట మంత్రులు పయ్యావుల, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు తదితరులు ఢిల్లీ వెళ్లనున్నారు.