BJP Political Strategy in Palamuru District : ఉమ్మడి పాలమూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా పుంజుకుంటోంది. గత పార్లమెంట్, శాసనసభ ఎన్నికలతో పోల్చితే, ఈ లోకసభ ఎన్నికల్లో బీజేపీకి దక్కిన ఓట్లు గణనీయంగా పెరిగాయి. అధికార కాంగ్రెస్‌కు సిటింగ్ ఎంపీ ఉన్న బీఆర్ఎస్ను తలదన్ని మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానాన్ని బీజేపీ దక్కించుకుంది. క్షేత్రస్థాయిలో పెద్దగా బలంలేని నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోనూ సిటింగ్ బీఆర్ఎస్ను వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిచింది.
కాంగ్రెస్ కంచుకోటైన కందనూలు, నడిగడ్డల్లో గట్టి పోటీనిచ్చింది. ప్రస్తుత లోక్‌సభ ఫలితాలు కమళదళంలో నూతనోత్సాహాన్ని నింపుతున్నాయి. మహబూబ్‌నగర్‌లో 2019లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 3,33,000 ఓట్లు పోలయ్యాయి. 78వేల ఓట్ల తేడాతో అప్పుడు డీకే అరుణ ఓటమి పాలయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో లక్షా 80 వేల ఓట్లు అధికంగా చేరడంతో, బీజేపీకి 5లక్షల 10వేల ఓట్లు దక్కాయి.
సీఎం సొంత జిల్లాలో పాగా వేసిన కమలదళం : ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 7నియోజక వర్గాల్లో కాషాయపార్టీకి కేవలం లక్షా 20 వేల ఓట్లే దక్కాయి. 6నెలల తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో అనూహ్యంగా 4లక్షల ఓట్లు అదనంగా కమలదళం ఖాతాలో పడ్డాయి. 7నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నా, నారాయణపేట, మక్తల్, దేవరకద్ర, మహబూబ్‌నగర్ సెగ్మెంట్లలో కాషాయపార్టీకే మెజారిటీ దక్కింది. నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి దక్కిన ఓట్లు లక్షా 29 వేలు.
ఇటీవలి శాసనసభ ఎన్నికల్లోనూ వచ్చిన ఓట్లు దాదాపుగా అంతే. కానీ, 2024 ఎంపీ బరిలో కమలదళానికి దక్కిన ఓట్ల సంఖ్య ఏకంగా 3లక్షల 70 వేలకు పెరిగింది. 6 నెలల వ్యవధిలోనే ఏకంగా 2లక్షల 30వేల ఓట్లు అదనంగా వచ్చాయి. మరోవైపు నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్కు సిటింగ్ స్థానం కాగా, బలమైన అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో నిలిచారు. ఐనప్పటికీ గులాబీ పార్టీని వెనక్కినెట్టి కమలం పార్టీ రెండో స్థానంలో నిలవడం, శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
BJP Campaign On Congress Failures : బీజేపీ లోకసభ ఎన్నికల్లో పుంజుకోవడానికి అనేక కారణాలున్నాయి. 2 నియోజక వర్గాల్లో బలమైన అభ్యర్ధులను బీజేపీ అధిష్ఠానం బరిలోకి దింపింది. మహబూబ్‌నగర్‌లో డీకే అరుణ, నాగర్‌కర్నూల్‌లో ఎన్నికల ముందు బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరిన సిటింగ్ ఎంపీగా ఉన్న రాములు కుమారుడు భరత్ ప్రసాద్‌కు టికెట్లు కేటాయించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో, కేంద్రంలో మోదీ అధికారంలో ఉండటమే మేలంటూ ఉద్ధృతంగా ప్రచారం చేసింది.
ఆరు గ్యారంటీల అమలు విషయంలోనూ కాంగ్రెస్ వైఫల్యాలను జనంలో ఎండగట్టింది. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కారణంగా బీఆర్ఎస్లో నైరాశ్యం నిండింది. బరిలో బీఆర్ఎస్ అభ్యర్థులను నిలిపినా, వారిని పార్లమెంట్‌కు పంపాల్సిన ఆవశ్యక్తతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోయారు. దీంతో ప్రత్యాన్మాయంగా ఓటర్లు బీజేపీను ఎన్నుకున్నారు. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో బీజేపీ బలం గణనీయంగా పెరిగింది.