Chandrababu Meeting With TDP Cadre in Telangana : తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ తమ కార్యకర్తల బలం చెక్కు చెదరలేదని తెలుగుదేశం పార్టీ బలంగా విశ్వసిస్తోంది. రాష్ట్రస్థాయిలో సరైన నాయకత్వం లేకున్నా.. దిశానిర్దేశం చేసేవారు కరవైనా.. క్షేత్రస్థాయిలో భారీస్థాయిలో శ్రేణులు ఇంకా తెలుగుదేశం జెండాను తమ గుండెల్లోనే దాచుకున్నారని భావిస్తోంది. అందుకే.. తెలంగాణలో పార్టీకి తిరిగి పూర్వవైభవం తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే.. తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. ఇందుకోసం తెలుగు తమ్ముళ్లను సమాయత్తం చేస్తున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత పార్టీకి తగిలిన ఎదురు దెబ్బలను ఇక్కడి కార్యకర్తలు కళ్లారా చూశారు. 2014 ఎన్నికల తర్వాత నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా స్వర్ణాంధ్ర నిర్మాణం కోసం తాను ఏపీ పాలనపైనే దృష్టిసారించాల్సి వచ్చిందన్న అధినేత మాటలను అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడి కీలకనేతలంతా పార్టీని వీడినా.. తాము మాత్రం పసుపు జెండా కిందనే ఉంటామని కార్యకర్తలంతా అలాగే ఉండిపోయారు. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు ఉన్నప్పటికీ.. వారిని ముందుకు నడిపించే నాయకులే కరువయ్యారని పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ శ్రేణులతో.. తాజాగా చంద్రబాబు సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఏపీలో దుర్మార్గుడితో పోరాడాం..
ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో.. పార్టీ అధినేత చంద్రబాబు తెలంగాణ నేతలతో సమావేశమై.. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారని సమాచారం. ఈ సందర్భంగా బాబు కీలక సూచనలు చేసినట్టు తెలుస్తోంది. "ఏపీలో ఐదేళ్లపాటు ఓ దుర్మార్గుడితో పోరాడాల్సి వచ్చింది. అందువల్లే తెలంగాణపై దృష్ఠి సారించలేకపోయాం. ఈ కారణంగానే గడిచిన శాసనసభ, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయాం. అయినా.. మీరంతా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. త్వరలోనే రాష్ట్ర కమిటీ ఏర్పాటు వేసుకుందాం. కింది స్థాయి నుంచి పార్టీ పునర్నిర్మాణం జరగాలి. బీసీలను, యువతను ప్రోత్సహించి మళ్లీ పూర్వవైభవం సాధిద్దాం. జూన్ 4 తర్వాత నుంచీ ఖచ్చితంగా సమయం కేటాయిస్తా." అని బాబు చెప్పినట్టు తెలుస్తోంది.
"తెలంగాణలోనే పుట్టిన తెలుగుదేశం పార్టీని ఇక్కడ మళ్లీ నిలబెట్టాలి. ఇందుకు పూర్తిస్థాయిలో ప్రక్షాళన అవసరం. త్వరలోనే రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసి, అధ్యక్షుడిని ఎన్నుకుందాం. పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్లని గుర్తుపెట్టుకుంటాను. తగిన ప్రాధాన్యం ఇస్తాను" అని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో పార్టీ నేతలు బక్కని నర్సింహులు, అరవింద్ కుమార్ గౌడ్, నన్నూరి నర్సిరెడ్డి, తిరునగరి జ్యోత్స్న, కంభంపాటి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నట్టు సమాచారం.