Sri Rama Navami : తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చింది మెుదలూ రాష్ట్రంలో ఆలయాల ధ్వంసం మొదలైందని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆలయాలకు గతవైభవాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో దేవాలయాలపై దాడులు పెరిగాయని, రథాలు తగలబడ్డాయని, అర్చకులపై దాడులు జరిగాయని చంద్రబాబు ట్విట్టర్ (ఎక్స్) ద్వారా ఆరోపించారు.
దాడులు పెరిగాయ్: నవమి అనగానే తనకు నాడు కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయంలో చేసిన అభివృద్ధి గుర్తుకు వచ్చిందని నారా చంద్రబాబు తెలిపారు. అలాగే మూడేళ్ల క్రితం విజయనగరం రామతీర్థం ఆలయంలో శ్రీరాముని విగ్రహం తలను తొలగించిన దారుణ ఘటనా గుర్తుకు వచ్చిందని తెలిపారు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక దేవాలయాలపై దాడులు పెరిగాయని, రథాలు తగలబడ్డాయని, అర్చకులపై దాడులు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు. కలియుగ వైకుంఠ దైవం తిరుమల ఏడుకొండల వాడి పుణ్యక్షేత్రంతో సహా అనేక హిందూ దేవాలయాల పవిత్రత దెబ్బతీసే అనేక చర్యలు జరిగాయని, చంద్రబాబు ఆరోపించారు.
ఏ ఒక్క ఘటనలోనూ నిందితులు అరెస్టు కాలేదు: రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జరుగుతున్నా, ఏ ఒక్క ఘటనలోనూ నిందితులు అరెస్టు కాలేదని చంద్రబాబు దుయ్యబట్టారు. భక్తుల మనోభావాలు కాపాడేందుకు ఏ ఒక్క ప్రయత్నమూ ప్రభుత్వం చెయ్యలేదని విమర్శించారు. 'హిందూ భక్తుల మనోభావాలపై గొడ్డలి పోట్లు' అనదగ్గ సుమారు 160 ఘటనలు జరిగాయని తెలిపారు. అయినప్పటికీ ఈ ప్రభుత్వం అది సమస్యే కాదన్నట్లు అలక్ష్యం చేయడం భక్తులను మరింత బాధించిందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రామతీర్థం ఆలయంలో రాములోరి తలను విగ్రహం నుంచి తొలగించి అక్కడే ఉన్న కోనేరులో పడేసి పోయారని ఆరోపించారు. ఈ శ్రీరామ నవమి రోజు చెపుతున్నా, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒంటిమిట్ట మాదిరిగా రామతీర్థం దేవాలయాన్ని అద్భుతంగా అభివృద్ది చేస్తామని చంద్రబాబు హామీఇచ్చారు. రాష్ట్రంలో దేవాలయాల రక్షణకు, పవిత్రతను కాపాడేందుకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తామన్నారు.
త్వరలోనే రామరాజ్యం: త్రేతాయుగం నాటి రామరాజ్యం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం అంటే దానికి కారణం, ప్రజల మనోభావాలకు అనుగుణంగా సాగిన శ్రీరాముని పాలన అని చంద్రబాబు వెల్లడించారు. పాలకులు తన కుటుంబం కంటే ప్రజల ఆనందమే ముఖ్యమని భావించాలని శ్రీ రామ కథ చెబుతోందని తెలిపారు. అటువంటి వారి పాలనలోనే ఊరు పచ్చగా ఉంటుందని పేర్కొన్నారు. సమాజంలో శాంతి వెల్లివిరుస్తుందని, మరి కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అటువంటి సుభిక్షమైన, సుఖశాంతులతో కూడిన రామరాజ్యం నాటి పాలన అందిరావాలని కోరుకుంట్లు చంద్రబాబు తెలిపారు. త్వరలో ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యాన్ని ప్రజలకు అందిస్తామని చంద్రబాబు స్పష్టంచేశారు.
భద్రాద్రిలో అంబరాన్నంటిన రాములోరి కల్యాణ వేడుక - Bhadrachalam Sita Ramula Kalyanam