Telangana Parliament Elections 2024 : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. పలుచోట్ల చెదురుమదురు ఘటనలు మినహా, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 64.93 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. అత్యధికంగా భువనగిరిలో 76.47 శాతం ఓటింగ్ నమోదు కాగా, హైదరాబాద్‌లో ఎప్పటిలాగే అత్యల్పంగా అత్యల్పంగా 46.08 శాతం ఓటింగ్ నమోదైనట్లు సీఈవో స్పష్టం చేశారు.
Car Symbol Controversy in Gadwal District : అయితే సోమవారం జరిగిన పోలింగ్ ప్రక్రియలో కొన్నిచోట్ల ఈవీఎంల మొరాయింపు, బీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల వాగ్వివాదం తదితర కారణాల వల్ల పోలింగ్ నిలిచిపోయింది. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం పైపాడులోని పోలింగ్ బూత్ నంబర్ 167లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఈవీఎంలో కారు గుర్తు కనిపించకుండా మార్కర్‌తో రుద్దడంతో వివాదం నెలకొంది. దీంతో కొంత సమయం పోలింగ్‌కు బ్రేక్ పడింది. ఈ బూత్‌లో మొత్తం 1,196 ఓట్లు ఉండగా, 848 ఓట్లు పోలైన తర్వాత వచ్చిన ఓ ఓటరు దీనిని గమనించి సంబంధిత అధికారులకు తెలియజేశారు.
విషయం తెలుసుకున్న భారత రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు పోలింగ్ బూత్ వద్దకు వచ్చి ఎన్నికల సిబ్బందితో మాట్లాడారు. పరిస్థితి చేజారిపోకముందే ఇక్కడి అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్పీ రితిరాజ్ బూత్ వద్దకు చేరుకుని పోలింగ్ అధికారితో మాట్లాడారు. ఆపైన ఈవీఎం ప్యాడ్‌పైన మార్కర్ గుర్తును తుడిచేయడంతో కారు గుర్తు మళ్లీ పూర్తిగా కనిపించింది. ఆ తర్వాత తిరిగి పోలింగ్ కొనసాగించారు. అయితే బూత్ నంబర్ 167లో పోలింగ్ సక్రమంగా జరగలేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. అవసరమైతే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ గుర్తు పైనా : మరోవైపు మహబూబాబాద్ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. బయ్యారం వెంకట్రాంపురంలోని 26వ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంపై కాంగ్రెస్ పార్టీ గుర్తు ఉన్న దగ్గర ఎవరో గుర్తుతెలియని దుండగులు ఇంకు పెట్టారు. బీఆర్ఎస్ ఏజెంట్ గుర్తించి అభ్యంతరం వ్యక్తం చేయడంతో అధికారులు కాసేపు పోలింగ్‌ను నిలిపివేశారు. మరో ఈవీఎంను ఏర్పాటు చేసి ఓటింగ్ కొనసాగించారు.
చింతమడకలో కేసీఆర్ - నందినగర్‌లో కేటీఆర్ ఓటు - తొలిసారి ఓటేసిన హిమాన్షు - kcr family casted vote