CAG Report on AP Economic Statistics : 2022-2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏపీ ఆర్థిక గణాంకాలపై కాగ్ నివేదిక ఇచ్చింది. రాబడులు - వ్యయాలకు సంబంధించిన అంశాలపై ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నివేదిక ఇచ్చింది. పథకాల అమలు కోసం కేంద్రం బదలాయించిన రూ 15,771 కోట్ల రూపాయలు వార్షిక ఖాతాల్లో ప్రతిఫలించలేదని కాగ్ పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.48,728 కోట్ల రూపాయల రుణాలు తీసుకోవాలని అంచనా వేస్తే రాష్ట్రప్రభుత్వం రూ.52,508 కోట్ల రుణం తీసుకుందని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం స్పష్టం చేసింది. అసెంబ్లీ ఆమోదించిన మొత్తం కంటే అదనంగా రూ. 4,027 కోట్లను ఖర్చు చేసేశారని స్పష్టం చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 341 రోజుల పాటు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులను ఏపీ వినియోగించుకుందని పీఏజీ వెల్లడించింది. రిజర్వు బ్యాంకు ఖాతాలో రూ.1.94 కోట్ల కంటే తక్కువ నిల్వల కారణంగా ఏడాదిలో 1,18,039 కోట్లను వేస్ అండ్ మీన్స్ గా వాడుకున్నట్టు వెల్లడించింది.
ఇదే ఆర్థిక సంవత్సరంలో 152 రోజుల పాటు ఏపీ ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని వాడుకుందని వెల్లడించింది. మొత్తం 57,066 కోట్ల మేర ఓవర్ డ్రాఫ్ట్ ఏపీ వాడుకున్నట్టు నివేదికలో పీఏజీ పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 73 మార్లు బహిరంగ మార్కెట్ ద్వారా 57,478 కోట్ల మేర ఏపీ అప్పు తెచ్చిందని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ ఏడాదిలో 8,411 కోట్ల మేర ఏపీ అప్పు తెచ్చిందని పీఏజీ (ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్) వెల్లడించింది. మూలధన వ్యయం కేవలం రూ.7244 కోట్లకు మాత్రమే పరిమితమైందని స్పష్టం చేసింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో మూలధన వ్యయం కేవలం 0.55 శాతం మాత్రమే అని పీఏజీ వెల్లడించింది. వివిధ కార్పోరేషన్లు రుణం తీసుకునేందుకు ప్రభుత్వ హామీలు రూ.1,38,875 కోట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ పేర్కొంది.
ఆర్థిక అంశాలు, జలవనరుల శాఖలో వెలిగొండ ప్రాజెక్టుపై కాగ్ నివేదిక ఇచ్చింది. పనులు ప్రారంభించి 17 ఏళ్లు అయినా సొరంగాలు, కాలువల నిర్మాణాల లోపంతో ప్రాజెక్టు అసంపూర్తిగా ఉందని కాగ్ పేర్కొంది. తద్వారా కరవు పీడిత ప్రాంత ప్రజలకు ప్రాజెక్టు వల్ల ఆశించిన ప్రయోజనాలు అందటం లేదని తెలిపింది. వెలిగొండ ప్రాజెక్టుకు 2017-21 మధ్య బడ్జెట్ కేటాయింపులు పెరిగినా ప్రభుత్వం తక్కువ వ్యయం మాత్రమే చేసిందని, 2190 కోట్ల రూపాయల బడ్జెట్ కు గానూ ప్రభుత్వం 1,270 కోట్లు మాత్రమే వ్యయం చేసిందని కాగ్ పేర్కొంది.
రికార్డు స్థాయిలో అప్పులు, రాబోయే ప్రభుత్వానికి చుక్కలు కనపడటం ఖాయం!
టన్నెల్ బోరింగ్ యంత్రం బదులుగా మాన్యువల్ డ్రిల్ విధానం ద్వారా వృథా ఖర్చు జరిగిందని పేర్కొంది. హైడ్రో, ఎలక్ట్రో మెకానికల్ పరికరాలు ప్రణాళిక లేకుండా సేకరించటం వల్ల నిరుపయోగంగా మారాయంది. ముందస్తు చెల్లింపులు కాకుండా ప్యాకేజీల పేమెంట్ షెడ్యూళ్లను సమీక్షించాలని కాగ్ సూచించింది. గుత్తేదారులకు అదనపు పనుల మంజూరు ద్వారా ప్రాజెక్టు వ్యయం రూ.339 కోట్లకు అదనంగా పెరిగిందని పేర్కొంది. కొన్ని ప్యాకేజీల్లో గుత్తేదారుల మార్పు కారణంగా ప్రాజెక్టు వ్యయం 419 కోట్లకు పెరిగిందని ఆక్షేపించింది. అభయారణ్యంలో సొరంగంలో తవ్విన శిథిలాలను కుప్పలు వేయటం పర్యావరణ పరంగా ఇబ్బందని కాగ్ నివేదికలో పేర్కొంది.
రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన వైసీపీ - ప్రభుత్వ ఆదాయమంతా వడ్డీలకే : విజయ్‌కుమార్