Anakapalle YSRCP MP candidate Budi Mutyala Naidu : రాష్ట్ర ఎన్నికల్లో పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఓకే కుటుంబంలో ఒకరిద్దరు పోటీ చేస్తున్నామని ప్రకటన చేయడం అనంతరం సైలెంట్ అయిపోవడం జరిగింది. కొన్ని రోజులు టెక్కలి వైఎస్సార్సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా ఆయన సతీమణీ దువ్వాద వాణీ పోటీ చేస్తున్నారని ప్రచారం జరిగింది. ఆ పార్టీ పెద్దలు బుజ్జగించడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. తాజాగా ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. 'మా నాన్నను ఓడించండి' ఓ కొడుకు బహిరంగ ప్లకార్డులతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
Budi Ravikumar Campaign : 'మా నాన్నని ఓడించండి' అంటూడిప్యూటీ సీఎం అనకాపల్లి పార్లమెంటు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు కుమారుడు బూడి రవికుమార్ ప్రచారం చేస్తున్నారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు, మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన రెండో భార్య కుమార్తె అనురాధ పోటీ చేస్తున్నారు. దీంతో బూడి ముత్యాలనాయుడు మొదటి భార్య కుమారుడు బూడి రవికుమార్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. ఈ మేరకు రవికుమార్ తన తండ్రిపై సామాజిక మాధ్యమాల్లో వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. 'కన్న కొడుకుకే న్యాయం చేయలేని వాడు ఓటేసిన ప్రజలకు ఏమి చేయగలరని' ప్రశ్నించారు. 'ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయండని, మా నాన్న బూడి ముత్యాలనాయుడిని ఓడించాలని' రవికుమార్ ఓటర్లను విజ్ఞప్తి చేశారు. పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతోంది. దీంతో వైసీపీ నేతలు తలలు పట్టుకున్నారు.
కుమారుడికి రాజకీయంగా అవకాశం ఇవ్వకుండా రెండో భార్య కుమార్తెకు రాజకీయంగా అవకాశం ఇవ్వడంతో రవికుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. దీంతో అనకాపల్లి జిల్లాలో బూడి రవికుమార్ విడుదల చేసిన పాస్టర్ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన రవికుమార్ ఎన్నికల ప్రచారాన్ని జోరు పెంచారు. తన తాత, ప్రజలు ఆశీస్సులతో తప్పకుండా స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరూ ఆలోచించి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్న తనను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బూడి ముత్యాల నాయుడును ఓడించాలని ఆయన కుమారుడే వ్యతిరేకింగా ప్రచారం చేయడంతో జిల్లాలోని వైసీపీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది.
క్యాంప్ కార్యాలయం ఖాళీ చేసిన అధికారులు : డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు క్యాంప్ కార్యాలయాన్ని రాజకీయంగా వినియోగించుకుంటున్నారని ఇటీవల ఆయన కుమారుడు బూడి రవికుమార్ ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు స్పందించి క్యాంపు కార్యాలయం ఖాళీ చేయించారు. మరోవైపు దేవరాపల్లిలోని రైవాడ అతిథి గృహానికి వైసీపీ రంగులు ఉన్నాయని ఫిర్యాదుతో వాటిని మార్చారు.