KTR Tweet On Bus Journey Issue : ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. ఇందుకు సంబంధించి ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. గురువారం బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మహిళా సోదరీమణులను బాధించి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అక్కాచెల్లెళ్లను కించపరిచే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.
నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే, నేను విచారం వ్యక్తం చేస్తున్నాను ..
— KTR (@KTRBRS) August 16, 2024
నా అక్కచెల్లమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు.
అసలేం జరిగిందంటే? : ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఫ్రీ ట్రావెల్‌పై కేటీఆర్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బస్సుల్లో అల్లం- వెల్లుల్లి, కుట్లు, అల్లికలు చేసుకుంటే తప్పేంటన్న రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) వ్యాఖ్యలపై స్పందించారు. బస్సుల్లో కుట్లు, అల్లికలు తాము వద్దనట్లేదని, అవసరమైతే బ్రేక్ డ్యాన్స్‌లు వేసుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని గురువారం తెలంగాణ భవన్లో జరిగిన చేరికల సమావేశంలో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బస్సుల్లో సీట్ల కోసం ప్రయాణికులు తన్నుకుంటున్నారన్న కేటీఆర్, ఆర్టీసీ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని, బస్సుల సంఖ్య పెంచాలని కోరుతున్నట్లు తెలిపారు.
కేటీఆర్ వ్యాఖ్యలు అభ్యంతరకరం : అనంతరం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. రాష్ట్ర మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్, బేషరతుగా మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవచ్చంటూ, కేటీఆర్ అత్యంత జుగుస్పాకరంగా మాట్లాడారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మహిళలపై చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా తీసుకొని, విచారణ ప్రారంభించింది. మహిళల పట్ల కేటీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు మహిళా కమిషన్ పేర్కొంది. తెలంగాణ మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయని కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద తన ఎక్స్’లో పోస్టు చేశారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై నేడు నిరసనలు : ఫ్రీ బస్సు ప్రయాణంపై మహిళలను అవహేళన చేస్తూ కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని వాటిని నిరసిస్తూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు చేయాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పిలుపునిచ్చారు. మండల, నియోజకవర్గ, జిల్లా సెంటర్లలో కేటీఆర్ దిష్టిబొమ్మల దహనం, నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.