KTR Fires ON CM Revanth Over Padi Kaushik Attack : హైదరాబాద్ ప్రజలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పగపట్టారని, అందుకే ప్రాంతీయ అసమానతలు రెచ్చగొట్టి చిల్లర రాజకీయం చేస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన కేటీఆర్, ఇవాళ కొండాపూర్‌లోని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లారు. కౌశిక్‌రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రాష్ట్రంలో చేతగాని హోం మంత్రి, ముఖ్యమంత్రి ఉన్నారని దుయ్యబట్టారు.
రేవంత్ రెడ్డి ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా, పార్టీ ఫిరాయింపులు సహా ఆరు గ్యారెంటీల అమలుపై పోరాడుతూనే ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ తిరిగి కాళ్లు, ఏళ్లు పట్టుకొని కండువాలు కప్పి కాంగ్రెస్‌లో చేర్చుకున్నారని, హైకోర్టు తీర్పుతో హస్తం పార్టీ నేతలు గజగజా వణుకుతూ కొత్త నాటకాలు ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. ఫిరాయింపులపై మొదట పిటిషన్ వేసిన కౌశిక్ రెడ్డి, దమ్ముంటే రాజీనామా చేయాలని అన్నారని, ఏం తప్పు మాట్లాడారని కేటీఆర్ ప్రశ్నించారు.
హింసాయితమైన పద్ధతులను గతంలో ఎప్పుడూ చూడలేదు : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఉరి తీయాలని గతంలో సీఎం రేవంత్ అన్నారన్న కేటీఆర్, పార్టీ మారానని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే బహిరంగంగా ప్రకటించినప్పటికీ పీఏసీ ఛైర్మన్ పదవి ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. తొమ్మిదేళ్లలో 9500 కోట్లతో తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని గాంధీ మొన్న ఎన్నికల్లో శేరిలింగంపల్లి ఓటర్లకు చెప్పారని, మీ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో అడగాలని శేరిలింగంపల్లి ప్రజలను కోరారు.
ఆనాడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపండి, చావు డప్పులు కొట్టండని మాట్లాడిందే రేవంత్ రెడ్డి.
— BRS Party (@BRSparty) September 14, 2024
మా పార్టీ వాళ్ళెవరూ ఆయన మాట్లాడినంత అసహ్యంగా మాట్లాడలేదు.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS pic.twitter.com/RevXmFO2xu
హైదరాబాద్‌లో కనీసం శాంతి భద్రతలు అదుపులో ఉంచలేకపోతున్నారని కేటీఆర్ విమర్శించారు. గూండాలకు పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చి కౌశిక్‌రెడ్డిపై దాడికి పంపారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో హైడ్రా పేరిట హైడ్రామాలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తించుకోవాలని హితవు పలికారు. రేవంత్ రెడ్డి దుష్ట సంప్రదాయాలకు తెరలేపుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. అవన్నీ ఆయన మెడకే చుట్టుకుంటాయని హెచ్చరించారు.
"ఇటువంటి గూండాగిరీ, దౌర్భాగ్యం గత పదేళ్లలో ఎప్పుడూ లేదు. పోలీస్ ఎస్కార్ట్‌తో ఫ్యాక్షనిస్టు తరహాలో వచ్చి ఒక ఎమ్మెల్యే ఇంటిపై దాడులు చేశారు. రాష్ట్రంలో చేతగాని హోం మంత్రి, ముఖ్యమంత్రి అధికారంలో ఉండటం వల్లే ఇలా జరిగింది. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు కాపడలేని సీఎం, ఎమ్మెల్యేల ఇండ్లపై దాడులు చేయిస్తున్నారు. గాంధీ సహా పది మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని, ఈ అంశంపై సభాపతి కూడా నిర్ణయం తీసుకోవాలని కోరారు."-కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్