BRS MLA Vivekanand Fires On CM Revanth : కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ల సమయంలో సీఎం రేవంత్ మాట్లాడిన భాషను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద తెలిపారు. ఆరు గ్యారంటీల అమలు గురించి ప్రశ్నిస్తే, వ్యక్తిగత దూషణలు చేయడం దారుణమని అన్నారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు ఎవరిని తొక్కుకుంటూ వచ్చారని నిలదీశారు. సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలు పైరవీలకు అడ్డాలుగా మారాయని ఆయన ఆరోపించారు.
MLA Vivekanand Comments On CM : సీఎం రేవంత్ రెడ్డి తన హోదా మరిచిపోయి, దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని కేపీ వివేకానంద గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ల సమయంలో ఆయన బీఆర్ఎస్ నాయకుల గురించి మాట్లాడుతున్న భాష అనాగరికంగా ఉందని మండిపడ్డారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. వాటన్నింటినీ ఎప్పుడు అమలు చేస్తారని ప్రజలు అడుగుతుంటే, ముఖం చాటేస్తున్నారని దుయ్యబట్టారు.
BRS MLA Vivekanand On congress : దేశవ్యాప్తంగా కాంగ్రెస్ విశ్వాసం కోల్పోయిందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి పరాభవం తప్పదని వివేకానంద జోస్యం చెప్పారు. దేవుళ్లపై ఒట్టేస్తూ రేవంత్ ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని, దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల స్వరూపం పూర్తిగా మారుతుందని తెలిపారు. కేసీఆర్ బస్సు యాత్రతో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు సానుకూల ఫలితాలొస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
పెన్షన్ పెంపు ఎప్పుడు అమలు చేస్తారు : వడగళ్ల వానతో రైతులు, నీటి ఎద్దడితో నగర ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చేతగాని వాళ్లలా పాలకులు చేతులేత్తేశారని ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు 2500 రూపాయలతో పాటు వృద్ధులకు పెన్షన్ పెంపు ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు. డిసెంబర్ 09వ తేదీన రుణమాఫీ చేయనందుకు తెలంగాణ రైతులకు రేవంత్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
'నాలుగు మాసాల్లోనే ప్రజల నమ్మకాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోల్పోయారు. కరెంట్ లేక రైతులు బాధ పడుతుంటే, దానిని పరిష్కరించే నాథుడే లేదు. మీరు తిట్ల పురాణం ఆపి ఒట్ల పురాణం గురించి చెప్పండి. రైతులకు మీ పార్టీ ఇచ్చిన హామీలను ఎంత వరకు నెరవేర్చారు. ఒక కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి అయి ఉండి, ప్రధాని మోదీని బడే భాయ్ అని సంభోదించిన సీఎంను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు" - కేపీ వివేకానంద గౌడ్, ఎమ్మెల్యే, కుత్బుల్లాపూర్
బీఆర్ఎస్ ఛలో ఆటో ర్యాలీలో ఉద్రిక్తత - పోలీసులతో కుత్బుల్లాపుర్ ఎమ్మెల్యే వాగ్వాదం