BRS President KCR Campaign In Medak : ఆరు గ్యారంటీల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని గాలికి వదిలేసిందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు. కేవలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నారని దాంతో ఆటో రిక్షా కార్మికులు రోడ్డున పడి ఆత్మహత్య చేసుకుంటున్నారని మండిపడ్డారు. మెదక్ రోడ్‌షోలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ మహిళల ఖాతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు రూ.2500 చొప్పున వేయడం లేదని గుర్తుకు చేశారు.
KCR Fires On Congress : సెంబరు 9లోపు రూ.రెండు లక్షల రుణం మాఫీ చేస్తామని కాంగ్రెస్ నాయకులు అన్నారని అయిందా అని ప్రశ్నించారు. విద్యార్థులకు స్కూటీలు ఇవ్వలేదు గాని లూటీ చేస్తున్నారని చెప్పారు. పింఛన్ల మొత్తం పెంచడం సంగతి దేవుడెరుగు గాని అసలుకే మోసం తెచ్చేలా జనవరి నెల పింఛన్‌ను ఎగవేశారని తెలిపారు. యువత ఉపాధికి రూ.5 లక్షలు మంజూరు చేయలేదన్నారు. ముఖ్యమంత్రే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించి రైతుబంధు రాకుండా చేశారని వివరించారు. వచ్చే సీజన్ నుంచి ఐదు ఎకరాల వరకే రైతుబంధు వేస్తారని ఆరు, ఏడు ఎకరాల రైతులు ఏం పాపం చేశారని ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో తాను పదిహేనేళ్లు పోరాటం చేసి చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించాను. ఆ తర్వాత ఒక్కోటి బాగుచేస్తూ రాష్ట్రాన్ని పొదరిల్లులాగా తీర్చిదిద్దాను. రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలను నమ్మి ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారు. ఇప్పుడు రాష్ట్రంలో విద్యుత్ కోతలు విధిస్తున్నారు. మిషన్ భగీరథ జలాలు ఆగిపోయాయి. రైతుబీమా ఉంటుందో ఉండదో తెలియదు. ఇప్పుడు కాంగ్రెస్ మోసాల నుంచి కాపాడాలంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి. -కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం
KCR Comments On BJP : ప్రధాని మోదీ పాలనలో అంతర్జాతీయంగా దేశప్రతిష్ఠ మంటగలిసిందని రూపాయి విలువ పతనమైందని కేసీఆర్ పేర్కొన్నారు. పదేళ్లలో మోదీ 150 వాగ్దానాలు ఇచ్చారని ఒక్కటీ అమలు చేయలేదని తెలిపారు. జన్‌ధన్ ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున వేస్తానన్న మోదీ మోసం చేశారన్నారు. కామారెడ్డి ప్రజలు బీజేపీ ఎమ్మెల్యేను గెలిపించినందుకు రూ.30 లక్షలు వేశారట నిజమేనా? అని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు ప్రస్తుత ఎన్నికల్లో ‘అబ్‌కీ బార్ చార్‌సౌ పార్’ అంటున్నారని కేంద్రంలో మళ్లీ ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే పెట్రోల్, డీజిల్ ధర రూ.400 కావడం ఖాయమని తెలిపారు.
బీజేపీ ఎజెండాలో పేదల కష్టాలు, బాధలుండవని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నవోదయ విద్యాలయాలు, వైద్య కళాశాలలు ఇవ్వలేదని తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఏపీకి అప్పజెప్పారని మండిపడ్డారు. సీలేరు విద్యుత్ ప్రాజెక్టును సైతం ఇచ్చేశారని తల్లిని చంపి పిల్లను బతికించారని తెలంగాణ ఆవిర్భావం గురించి మోదీ ఎద్దేవా చేశారన్నారు. బీజేపీకు ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో 200లకు మించి స్థానాలు రావని కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్థం చేశారు.
ప్రశ్నించే గొంతుకగా నిలిచే బీఆర్ఎస్ను గెలిపించాలి : గోదావరి, కృష్ణా నదీ జలాలను తరలించేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అందుకే బీజేపీకు ఓటు వేసి తెలంగాణకు అన్యాయం చేయవద్దని. ప్రశ్నించే గొంతుకగా నిలిచే బీఆర్ఎస్ను గెలిపించాలని ప్రజలను కోరారు. ఉమ్మడి మెదక్ జిల్లావాడిని కాబట్టి ప్రేమతోటి ఎప్పటి నుంచో డిమాండ్ ఉండడంతో మెదక్ పట్టణ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసుకున్నామని గర్తుకు చేశారు. అయితే ముఖ్యమంత్రి మెదక్ జిల్లాను తీసేస్తానంటున్నారని తెలిపారు. జిల్లా ఉండాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలవాలని మెదక్ కోసం యుద్ధం చేద్దాం అని కేసీఆర్ తెలిరపారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేశ్ రెడ్డి నామినేషన్ దాఖలు - Telangana Graduate MLC Elections