Harish Rao Comments on Loan Waiver Guidelines : రేషన్‌కార్డు నిబంధన లక్షలాది రైతుల ఆశలపై నీళ్లు చల్లడమేనని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి హరీశ్‌రావు ఆక్షేపించారు. రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో మభ్యపెట్టిందని, అధికారంలోకి వచ్చాక రుణమాఫీపై ఆంక్షలు పెడుతున్నారని దుయ్యబట్టారు. రుణమాఫీకి విధించిన గడువు తేదీ అసమంజసమని, డిసెంబరు 12, 2018 ముందు వర్తించదనడం సరికాదన్నారు.
రైతు రుణమాఫీ కంటే వడపోతల పైనే కాంగ్రెస్ సర్కార్ ఎక్కువ దృష్టి పెట్టిందని హరీశ్‌రావు మండిపడ్డారు. రైతుకు రుణభారం తగ్గించే ప్రయత్నం కన్నా, ప్రభుత్వ భారం తగ్గించుకునే ప్రయత్నమే ఎక్కువ కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. మరోవైపు బీఆర్ఎస్ సీనియర్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, రుణమాఫీపై ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు, మభ్యపెట్టేందుకు చేసే ప్రయత్నాలని ఆరోపించారు.
పీఎం కిసాన్ డేటాను అనుసరించడం అంటే రుణమాఫీ లక్ష్యానికి గండికొట్టడమే : ప్రభుత్వ మార్గదర్శకాలు అభ్యంతరకరంగా ఉన్నాయని అన్నారు. అందరి రుణాలను మాఫీ చేస్తామని, ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు కొందరికే పరిమితం చేసేందుకు మార్గదర్శకాలు తీసుకొచ్చారని ఆక్షేపించారు. అందుకే రేషన్ కార్డు, పీఎం డేటావంటి కొత్త నిబంధనలు తీసుకువచ్చారని నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు.
గతంలో గులాబీ రేషన్‌కార్డులు తీసుకుని, అప్పుడు అవి కూడా లేని రైతుల పరిస్థితి ఏంటని మాజీ మంత్రి నిలదీశారు. రుణమాఫీకి పీఎం కిసాన్ డేటాను అనుసరించడం అంటే రుణమాఫీ లక్ష్యానికి గండికొట్టడమే అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుందని, అందరి రుణాలను మాఫీ చేస్తామని నాడు బహిరంగంగా చెప్పి, ఇవాళ కొందరికే పరిమితం చేసేందుకు మార్గదర్శకాలు తీసుకొచ్చారని ఆక్షేపించారు.
Ex Minister Niranjan Fires on Congress : రుణమాఫీ చేశామన్న ప్రచారం కోసమే ప్రభుత్వ ప్రయత్నాలు తప్ప, రైతాంగం, వ్యవసాయం బాగుండాలి అన్న సంకల్పం లేదని మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో రెండు లక్షల రూపాయల రుణం పొందిన రైతులు ఎంత మంది ఉన్నారో ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. నాడు పరుగెత్తి రుణాలు తీసుకోండి వెంటనే మాఫీ చేస్తామని రైతులను పరుగులు పెట్టించి, నేడు చావు కబురు చల్లగా చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
తెల్లరేషన్ కార్డు ప్రామాణికం కాదని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రకటించారని, నాలుగు రోజులు తిరగక ముందే నాలుక మడతేశారని ఆక్షేపించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పది ఎకరాలు ఉండి గులాబీ కార్డులు ఉన్న రైతులకు రుణమాఫీ వర్తించదా, రేషన్ కార్డులు లేని రైతుల పరిస్థితి ఏంటని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.
రుణమాఫీపై రైతుల నుంచి ఫిర్యాదులు కోరడమంటే రైతుల మధ్య వివాదాలను సృష్టించడమేనని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఆశ చూపి అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ అధికారం వచ్చాక హామీల నుంచి తప్పించుకునేందుకు సాకులు వెతుకుతోందని అన్నారు. ప్రభుత్వ విధానం మూలంగా అధికారుల మీద రాజకీయ వత్తిళ్లు పెరుగుతాయని, కాంగ్రెస్ మోసాలకు భవిష్యత్‌లో కర్షకులు గుణపాఠం చెబుతారని నిరంజన్ రెడ్డి తెలిపారు.