Nizamabad BRS MP Candidate Election Campaign : రాష్ట్రంలో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్నికలకు మరికొద్ది రోజులే సమయం ఉండటంతో అన్ని పార్టీలు తమ ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచాయి. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలం పచ్చలనడ్కుడ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి తో కలిసి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారు.
ఎన్నికల సమయంలో ఇస్తామన్న హామీలు ఏమయ్యాయి : ఎన్నికల సమయంలో ఇస్తామన్న రూ.4000 పింఛన్ ఏది? రుణమాఫీ ఎక్కడ? తులం బంగారం ఎక్కడ? రైతుబంధు ఎక్కడ అని ప్రజలు ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలను నిలదీసి అడగాలని బాజిరెడ్డి గోవర్దన్ అన్నారు. అలా అడిగితే సమాధానం చెప్పలేక పారిపోతారని పేర్కొన్నారు. తనను గెలిపిస్తే ప్రజలకు సేవకుడిలా పనిచేస్తానని స్థానికులను కోరారు. బీజేపీ కాంగ్రెస్ మోసపూరిత మాటలు, వాగ్దానాలు నమ్మి మళ్లీ మోసపోవద్దని ప్రజలకు సూచించారు.
BRS Baji Reddy Govardhan Election Campaign : ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్థన్ మాట్లాడుతూ పచ్చలనడ్కుడ గ్రామం అంటే తనకు చాలా ఇష్టమన్నారు. ఈ గ్రామానికి తనకూ పూర్వ సంబంధముందని ఈ ప్రాంతానికి గతంలో త్రాగునీరు లాంటి ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. స్థానికంగా ఉన్న ప్రశాంత్ రెడ్డి కేసీఆర్కు అత్యంత సన్నిహితుడని తెలిపారు. బాల్కొండ ప్రాంతానికి, అనేక నిధులు తీసుకువచ్చి అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుంచారని వెల్లడించారు.
"రాష్ట్రానికి తొలిముఖ్యమంత్రిగా సేవలందించిన కేసీఆర్ కొట్లాడి తెలంగాణ సాధించి పదేళ్లలో పచ్చగా కళకళలాడేలా మార్చారు. ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించారు. కానీ కొద్ది రోజుల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ కంటే సంక్షేమ పథకాలకంటే డబుల్ ఇస్తానని చెప్పి ప్రజలను కాంగ్రెస్ మోసం చేసి ఓట్లు దండుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి"- బాజిరెడ్డి. గోవర్థన్, ఎంపీ అభ్యర్థి