BRS MLA Prashanth Reddy Comments on CM : మహిళల పట్ల సీఎం రేవంత్ రెడ్డి ప్రవర్తన తాలిబన్లను తలపించేలా ఉందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి మాటలకు సబితమ్మ కన్నీటి పర్యంతమయ్యారని తెలిపారు. గంటన్నర పాటు తాము నిరసన వ్యక్తం చేసినా, స్పీకర్ తమకు అవకాశం ఇవ్వకుండా రేవంత్ కనుసన్నల్లో మెదిలారని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేలు నాలుగున్నర గంటలు నిలబడి అడిగినా మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్న ఆయన, అసెంబ్లీ చరిత్రలో ఇలా ఎన్నడూ జరగలేదన్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డి అపరిచితుడు, ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారని ప్రశాంత్ రెడ్డి దుయ్యబట్టారు. సభలో ప్రతిపక్ష శాసన సభ్యులకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదన్నారు. సీనియర్ ఎమ్మెల్యేలు అనే గౌరవం లేకుండా అవమానించారని ఆక్షేపించారు. గతంలో బీజేపీ నేత డీకే అరుణపైనా ముఖ్యమంత్రి ప్రవర్తన ఇలాగే ఉందన్న ఆయన, తమ మహిళా ఎమ్మెల్యేలను కన్నీటి పర్యంతం చేసినందుకు అంతకంత అనుభవిస్తారన్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదని విమర్శించారు.
హామీలు నెరవేర్చలేక డ్రామాలు : రేవంత్ 2009లో ఎమ్మెల్యేగా గెలిచింది బీఆర్ఎస్ పొత్తు వల్లేనన్న సంగతి మర్చిపోవద్దని సూచించారు. రేవంత్ తెలంగాణ ద్రోహి అని, కేసీఆర్ గురించి మాట్లాడే స్థాయి ఆయనకు లేదని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఒకప్పుడు సోనియాను బలి దేవత అన్న సీఎం, నేడు దేవత అంటున్నాడని, అపరిచితుడిలా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిలా వ్యవహరించాలని హితవు పలికారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు, 13 హామీలు నెరవేర్చలేక డ్రామాలకు తెరలేపుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
సీఎం అపరిచితుడు, ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారు. సభలో ప్రతిపక్ష శాసనసభ్యులకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదు. మహిళా ఎమ్మెల్యేలు 4 గంటలు అడిగినా పట్టించుకోలేదు. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడే దమ్ము వీళ్లకు ఉందా? దేశంలోని 36 పార్టీలను ఒప్పించి తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్. తెలంగాణ కోసం కేంద్రమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. తెలంగాణ కోసం కనీసం ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయని వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక మహిళలను అవమానిస్తున్నారు. - వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే
ప్రజలు అన్నీ గమనిస్తున్నారు : రాష్ట్రంలో జరగుతున్న ఘటనలు, అసెంబ్లీలో జరుగుతున్న పరిస్థితులు ఒకే రకంగా ఉన్నాయని మరో ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఆరోపించారు. మహిళలను కించపరిచే వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, మహిళలే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని భూ స్థాపితం చేస్తారని మండిపడ్డారు. మహిళా ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.