BRS MLAs CM Revanth Latest News : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశం కావడంపై వస్తున్న ఉహాగానాలను ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖండించారు. తాము కాంగ్రెస్‌లో చేరుతున్నామనే కథనాల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. తామంతా కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్(Telangana Bhavan) వేదికగా, సీఎం రేవంత్‌తో భేటీపై మీడియాతో మాట్లాడారు. తాము పార్టీ మారబోం అని, మారాలనే ఉద్దేశం ఏమాత్రం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
BRS MLAs Reaction on Party Changing : తమ నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదని, తమకు ఎస్కార్ట్ సరిగ్గా కేటాయించడం లేదని సీఎం రేవంత్ రెడ్డిని, సంబంధిత అధికారులను కలిశామని గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి కేవలం కాంగ్రెస్ పార్టీకీ మాత్రమే సీఎం కాదని, అన్ని పార్టీల వారికీ ముఖ్యమంత్రే అని వ్యాఖ్యానించారు. నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డిని కలవడం తప్పా? అని ప్రశ్నించారు. తాము పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఎమ్మెల్యేలు ముక్తకంఠంగా ఖండించారు.
"మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలమంతా కలిసి, మా నియోజకవర్గ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రతినిధులకు ఇచ్చినంత ప్రొటోకాల్, ఎస్కార్ట్ మాకు ఇవ్వడం లేదని చెప్పాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం అందుబాటులో ఉండటంతో కలిసి సమస్యలను వివరించాటానికి మేమంతా కలిసి వెళ్లటం జరిగింది. దానికి సామాజిక మాధ్యమాల్లో, పత్రికల్లో పెద్ద కథనాలు వస్తున్నాయి. మేమేదో పార్టీ మారుతున్నట్లుగా, రహస్య చర్చలు జరుపుతున్నట్లుగా వస్తున్న అవాస్తవాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం." - సునీతా లక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే
'తల్లిలాంటి పార్టీని కాపాడుకుంటూ లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలి'
BRS MLAs Meeting CM Revanth Reddy : ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలమంతా, నియోజవర్గ సమస్యలపై ప్రస్తావించేందుకు సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. వేర్వేరు పార్టీలైనా సరే రాష్ట్రాభివృద్ధి విషయంలో సీఎం రేవంత్ కూడా ప్రధాన మంత్రి నరేంద్రమోదీని(PM Narendra Modi) కలుస్తున్నారు కదా అని ప్రశ్నించారు. దానికి మీడియాలో తాము పార్టీ మారుతున్నట్లుగా, రహస్య చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయా అని నిలదీశారు. తాము సీఎంను కలిస్తే మాత్రం ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని అడిగారు. తమ పరువుప్రతిష్ఠకు భంగం కలిగిస్తే దావా వేస్తామని హెచ్చరించారు.
గులాబీ పార్టీ వీడేది లేదు : కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. మమ్మల్ని అప్రతిష్ఠపాలు చేయాలని చూస్తున్నారు. మాకు పార్టీ మారే ఉద్దేశం లేదు. మాపై అపనిందలు వేయడం సరి కాదు. మా నియోజకవర్గ సమస్యలపై మాత్రమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశాం. అందులో తప్పేముంది. ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకే కాదు, అన్ని పార్టీల వారికి ముఖ్యమంత్రే. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను కూడా నేను కలిశాను. మెదక్ పార్లమెంట్లో నూటికి నూరు శాతం గెలిచేది గులాబీ జెండానే . కేసీఆర్‌ను, గులాబీ జెండాను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే వరకు సీఎం రేవంత్‌ను కలిసి నిలదీస్తూనే ఉంటామని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా సమస్యల గురించి చెప్పటానికి తామంతా సీఎం దగ్గరకు సాధారణంగా వెళ్లామని స్పష్టం చేశారు. దుబ్బాక నియోజకవర్గంలో రెవెన్యూ డివిజన్ కావాలని, కొన్ని రోడ్ల నిర్మాణాలకు డబ్బులు కావాలని కోరడానికి వెళ్లినట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమం ఆరంభం నుంచి బీఆర్ఎస్లోనే ఉన్నామని ఇప్పుడు ఎప్పుడూ గులాబీ జెండాను, కేసీఆర్‌ను వదిలి వెళ్లబోమని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్కి కార్యకర్తలే కథానాయకులు - వారే పార్టీకి ధైర్యం చెప్పారు : కేటీఆర్
పార్లమెంట్ ఎన్నికల కోడ్ బూచీ చూపి - హామీల అమలు వాయిదా వేసే యత్నం: హరీశ్‌రావు