BRS MLAs and MLCs Visited Medigadda Project : భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే ఆ పార్టీ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు బయల్దేరారు. అనంతరం కరీంనగర్‌లోని దిగువ మానేరు డ్యాంను బీఆర్ఎస్ బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అన్నారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణను ధాన్యాగారంగా మార్చామన్న ఆయన, చిన్న లోపాన్ని చూపి మొత్తం ప్రాజెక్టు విఫలం అన్నట్లు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"కేసీఆర్‌ను బద్నాం చేయాలని 8 నెలలుగా కుట్రలు చేస్తున్నారు. మేడిగడ్డ నుంచి ప్రతిరోజు లక్షల క్యూసెక్కులు పోతున్నాయి. నీరు దిగువకు వృధాగా పోతున్నా ఎత్తిపోయటం లేదు. 10 లక్షల క్యూసెక్కుల వరద తట్టుకొని మేడిగడ్డ ఠీవీగా నిలబడింది. కన్నెపల్లి పంపులు ఆన్ చేస్తే రిజర్వాయర్లన్నీ నిండుతాయి. ఎస్‌ఆర్‌ఎస్పీలో 90 టీఎంసీలకు గాను 24 టీఎంసీలు మాత్రమే ఉంది. ఎన్నికలు అయిపోయాయి, ఇక రాజకీయాలు వదిలేయాలి. రైతుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని రేవంత్‌రెడ్డికి సూచిస్తున్నాం." - కేటీ రామారావు, మాజీ మంత్రి
'ఈ ఏడాది కేవలం 45 శాతం వర్షపాతం నమోదు అయిందని అధికారులు చెబుతున్నారు. లోయర్ మన డ్యాం, మిడ్ మానేరు సహా ఎండిపోయిన ప్రాజెక్టులు పరిశీలించేందుకే మేము ఇక్కడికి వచ్చాం. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రాజెక్టులతో పాటు మేడిగడ్డని పరిశీలించేందుకు బయలుదేరాం. 10 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకొని మేడిగడ్డ ఠీవీగా నిలబడి ఉంది. లక్షలాది మంది రైతుల ప్రయోజనాలను రేవంత్ రెడ్డి ఫణంగా పెట్టి పంట పొలాలను ఎండబెడుతున్నారు. ఎల్ఎండి, అన్నపూర్ణ రిజర్వాయర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ నింపితే రైతులులో భరోసా ఏర్పడుతుంది' అని కేటీఆర్ అన్నారు.
మేడిగడ్డ మేడిపండు అని, లక్షల కోట్లు కొట్టుకుపోయాయని మీరు చేసిన ప్రచారాలన్నీ ఉత్తివేనని తేలాయని కేటీఆర్ అన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎండుతున్న ప్రాజెక్టులు, మండుతున్న రైతుల గుండెల బాధలను శాసనసభలో ఎండగడతామని హెచ్చరించారు. కేసిఆర్ ఆదేశాలతో గంగుల కమలాకర్ సూచనతో ప్రాజెక్ట్‌ల సందర్శనకు వచ్చామని తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ కుట్రలను ఎండగడతామన్నారు.
బీఆర్ఎస్ బృందం రాత్రికి రామగుండంలో బస చేసి, శుక్రవారం ఉదయం 10 గంటలకు కన్నేపల్లి వద్ద ఉన్న లక్ష్మీ పంప్ హౌస్‌ను పరిశీలిస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి మేడిగడ్డకు వెళ్లి ఆనకట్టను సందర్శిస్తారు. మేడిగడ్డ ఆనకట్ట పరిస్థితి, అక్కడ ప్రవాహం, పంప్ హౌస్ వద్ద నీటిమట్టం, ఎత్తిపోసేందుకు ఉన్న అవకాశాలు, తదితరాల గురించి పరిశీలిస్తారు.
పసలేని, దిశలేని, దండగమారి బడ్జెట్ - ప్రభుత్వ పద్దుపై కేటీఆర్ ట్వీట్ - KTR tweet on state budget 2024