BRS MLA Vivekananda Fires On Bhatti Vikramarka : కేటీఆర్ భాషను తప్పు పడుతున్న ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శిక్షణ ఇవ్వాలని, లేదంటే ఏఐసీసీ నేతలతో శిక్షణ ఇప్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ సూచించారు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని, సీఎం భాష సరిదిద్దుకోవాలని భట్టి ఏ రోజైనా సూచించారా అని ప్రశ్నించారు. కేసీఆర్ వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా నీచంగా, ఘోరంగా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను భట్టికి గుర్తు చేస్తున్నట్లు తెలిపారు.
ముందు సీఎం భాష మార్చుకుంటే, అందరూ కొనసాగిస్తారని, మంచి సంప్రదాయాన్ని నెలకొల్పాలని కోరారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని, ఆరో తేదీ సభలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుబంధు, రైతు భరోసా విషయంలో ఏం చెప్పి, ఏం చేశారో సమాధానం చెప్పాలన్న ఆయన, డిసెంబర్ తొమ్మిదో తేదీన చేస్తామన్న రూ.2 లక్షల రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. హామీలు అమలు చేయలేక అప్పులంటూ మొహం చాటేస్తున్నారని విమర్శించారు.
MLA Vivekananda Comments on CM Revanth : రేవంత్ రెడ్డి సవాళ్లు విసురుతారు కానీ, వాటిపై నిలబడరని వివేకానంద ఎద్దేవా చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ జరిపి చర్యలు తీసుకోండి అని కేటీఆర్ స్పష్టంగా చెప్పారని, తానే న్యాయస్థానం అన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి జైలు అంటూ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాపింగ్ చేస్తే చేసి ఉండవచ్చన్న కేటీఆర్ మాటలకు, వక్ర భాష్యం చెప్తున్నారని అన్నారు.
రోజూ తమ పార్టీ నాయకుల ఇళ్ల చుట్టూ సీఎం తిరుగుతూ దిగజారుడు రాజకీయం చేస్తున్నారన్న వివేక్, కాంగ్రెస్కు అభ్యర్థులు లేక తమ పార్టీ నేతలను తీసుకుంటున్నారని వ్యాఖ్యనించారు. తెలంగాణ రాష్ట్రం దిల్లీ కాంగ్రెస్కు ఏటీఎంలా మారిందని ఆరోపించారు. కాంగ్రెస్ టికెట్లు ఇచ్చిన దానం నాగేందర్, రంజిత్ రెడ్డిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి గతంలో ఏమన్నారో అందరికీ తెలియదా అన్న ఆయన, గతంలో అన్న ఆ మాటలకు సమాధానం చెప్పాలని కోరారు. సీఎం పరిపాలనను గాలికి వదిలేశారని, రాష్ట్రం తీవ్రమైన సంక్షోభం దిశగా వెళ్తోందని వివేక్ ఆందోళన వ్యక్తం చేశారు.
రైతులు ఇబ్బంది పడుతుంటే వారికి ధైర్యం చెప్పలేక సీఎం, మంత్రులు తప్పించుకొని తిరుగుతున్నారని ఆరోపించారు. ఆదివారం కేసీఆర్ జిల్లాల పర్యటనకు వెళ్తుంటే, శనివారం సీఎం సమీక్ష నిర్వహించారని ఎద్దేవా చేశారు. ఏప్రిల్ రాక ముందే హైదరాబాద్లో నీటి ఎద్దడి ప్రారంభమైందన్న ఆయన, ముఖ్యమంత్రి బాధ్యతతో వ్యవహరించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరారు. గత ప్రభుత్వం లీలలు అంటున్న తుమ్మల నాగేశ్వరరావు, మొన్నటి వరకు ఇక్కడే ఉన్న విషయం మర్చిపోవద్దని గుర్తు చేశారు. రాజకీయాల కోసం కాదు, ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.