BRS MLA Prashanth Reddy on RRR Alignment Changes : రీజినల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్‌మెంట్ మార్పుతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భూదందాలకు తెరలేపుతోందని, ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ చేయించాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ శాసనసభ్యుడు వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. స్వలాభం కోసం రీజినల్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మారుస్తూ పేదల భూముల్లో నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని, కాంగ్రెస్ నేతల భూములు ఉన్న వైపు అలైన్‌మెంట్ మారుస్తున్నారని ఆయన ఆరోపించారు. సాగర్ రోడ్లో గొల్లపల్లి గ్రామం నుంచి కర్మపల్లి గ్రామానికి, శ్రీశైలం రోడ్డులో దాదాపు నాలుగు కిలోమీటర్లు దూరానికి మార్చారని తెలిపారు.
ఫోర్త్ సిటీ కోసమని చెప్తున్నారని కానీ, అలైన్‌మెంట్ మార్పుతో ట్రిపుల్ ఆర్ ఫోర్త్ సిటీకి దూరమైందని వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. అమన్ గల్ వద్ద 400 ఎకరాల కుందారం భూములను పేదలు దశాబ్దాల తరబడి సాగు చేసుకుంటున్నారని, రాజ వంశీయులతో బేరం చేసుకొని పేదలను వెల్లగొట్టి కాంగ్రెస్ నేతలు భూములు ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. అక్కడ బిగ్ బ్రదర్స్ పేర్లు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగంలో నాలుగు చోట్ల అలైన్‌మెంట్ మార్చడం వెనకాల మతలబు ఏమిటని ప్రశ్నించారు. అలైన్‌మెంట్ మార్పు వెనకాల దందాలు, అరాచకాలు ఉన్నాయన్న ఆయన, ఎవరి భూముల కోసం అలైన్‌మెంట్ మార్పు జరుగుతోందని నిలదీశారు.
'జనవరి నుంచే పేద రైతుల నుంచి కబ్జా రద్దు ఒప్పందాలు చేసుకుంటూ భూములు లాక్కుంటున్నారు. కబ్జా రద్దు ఒప్పందం మొదటిసారి చూస్తున్నా. అలైన్‌మెంట్ మారి కాంగ్రెస్ ఎమ్మెల్యే గ్రామం మీదుగా ఎలా వెళ్తోంది. సీఎం బంధువుల గ్రామమైన మాడుగులలో ఏం జరుగుతోంది. చేవెళ్ల మార్గంలోనూ అంగడి చిట్టెంపల్లి నుంచి ఐదు కిలోమీటర్లు జరిగి మన్నెగూడ క్రాస్ రోడ్స్‌కు మార్చారు. మన్నెగూడ సమీపంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే, నేతల భూములు ఉన్నాయని ప్రజలు చెప్తున్నారు. బిగ్ బ్రదర్స్ భూములు సేకరించి పెట్టుకున్నారని అంటున్నారు'- వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ మంత్రి
సీబీఐ విచారణ చేయకపోతే కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే : కాంగ్రెస్ నేతల భూములు ఉన్న వైపు అలైన్‌మెంట్ మారుస్తున్నారని, కేంద్రం చేయకపోయినా సరే రోడ్డు తమ భూముల గుండా పోవాల్సిందే అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని వేముల ప్రశాంత్‌రెడ్డి ఆక్షేపించారు. తెలంగాణపై అప్పుల భారం, ప్రజల్ని అప్పుల ఊబిలోకి నెట్టైనా సరే ప్రపంచబ్యాంకు నిధులతో చేపట్టాలని భావిస్తున్నారని ఆరోపించారు. పాత అలైన్‌మెంట్ కొనసాగించాలని డిమాండ్ చేసిన ఆయన, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జోక్యం చేసుకొని పేదలు, గిరిజనుల బాధలు అర్థం చేసుకోవాలని కోరారు.
ప్రభుత్వం అలైన్‌మెంట్ మార్చాలని అనుకుంటే పూర్తి పారదర్శకంగా, పేదలకు మంచి పరిహారం ఇచ్చి చేయాలని ప్రశాంత్‌రెడ్డి కోరారు. అన్ని అంశాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ చేపట్టాలని కేంద్రమంత్రి బండి సంజయ్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఉన్న అనుమానాలను సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వం నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్న ఆయన, అలైన్‌మెంట్ మార్పు వ్యవహారంపై సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ చేయకపోతే కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అని భావించాల్సి వస్తుందని ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.