BRS MLA Jagadeesh Reddy Fires On Congress : కేసీఆర్ను జైల్లో పెడితే రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయా అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. కేసులు పెడతామని భయపెట్టి బతుకుదామని కాంగ్రెస్(Congress) నేతలు భావిస్తున్నారని, కేసీఆర్, బీఆర్ఎస్ దేనికీ భయపడదని త్యాగాలకు ఎప్పుడూ సిద్ధమని తెలిపారు. రైతుల సమస్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసిన గులాబీ నేతలు వినతిపత్రం అందించారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న ఆయన, ప్రకృతి వల్ల ఓ వైపు, ప్రభుత్వ నిర్లక్ష్యం మరోవైపు, కక్ష పూరిత వైఖరి వల్ల తీవ్ర సంక్షోభంలో ఉన్నారని అన్నారు.
Jagadeesh Reddy on CM Revanth reddy : రైతులు మళ్లీ ధైర్యం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని, నీటి విడుదలలో ప్రభుత్వ వైఫల్యం శాపంగా మారిందని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్(KCR) హయాంలో ప్రతి చెరువు ఏప్రిల్ నెలలోనూ మత్తడి దూకేలా చర్యలు తీసుకున్నారన్న ఆయన, కేసీఆర్ ఉండి ఉంటే ఒక్క ఎకరం కూడా ఎండిపోయేది కాదన్న భావన రైతుల్లో వస్తోందని తెలిపారు. కాళేశ్వరం వల్ల ఉపయోగం లేదన్న ప్రభుత్వం, కేసీఆర్ వస్తున్నారని నీరు ఎత్తిపోసి విడుదల చేస్తున్నారని పేర్కొన్నారు. సాగర్ నీటిని కేసీఆర్ పర్యటనకు ముందు విడుదల చేసి మళ్లీ బంద్ చేశారని అన్నారు. రైతుల పట్ల ఎందుకు ఇంత కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారన్న మాజీ మంత్రి, సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్రం, రైతులు, ప్రజలు అంటే పట్టింపు లేదని, దిల్లీకి వెళ్లి రావడం తప్ప ఏమీ లేదని వ్యాఖ్యానించారు.
రైతుల పరిస్థితి పై ఏనాడైనా సమీక్షించారా : కేసీఆర్ దిగిన వంద రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఉన్న నేతలకు అంత అనుభవం లేదన్న ఆయన, వాళ్ల ఆంధ్రా బాసులు చాలా మాట్లాడినా ఏమీ చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ లేరని రైతులు బాధపడుతున్నారని, ఏడుస్తున్నారని చెప్పారు. వంద రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కరికైనా ఉపయోగపడే పని చేసిందా అని ప్రశ్నించిన మాజీ మంత్రి, వర్షాభావ పరిస్థితులు, రైతుల పరిస్థితి పై ఏనాడైనా సమీక్షించారా అని అడిగారు. డబ్బులు వసూలు చేసి వారి కడుపులు నింపుకోవాలి, పైకి పంపాలి తప్ప వేరే సోయి లేదని ఆరోపించారు.
మళ్లీ నీళ్ల ట్యాంకర్లకు గిరాకీ వచ్చింది : రైతులు మళ్లీ అప్పుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి మళ్లీ వచ్చిందన్న జగదీశ్ రెడ్డి, వంద రోజుల్లోనే ఇంత దారుణమైన మార్పును కేసీఆర్ ఊహించలేదని అన్నారు. విద్యుత్ విషయంలో మంత్రులు అబద్ధాలు మాట్లాడుతున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా మోటార్ల మరమ్మత్తు కేంద్రాల వద్దకు పోతే వాస్తవాలు తెలుస్తాయని తెలిపారు. కరెంట్ కోతలు లేవు అంటూనే సీఎం, కేంద్ర మంత్రులు పాల్గొన్న కార్యక్రమాల్లో కరెంట్ పోతోందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్కరోజు కూడా రోడ్డుపై బిందె కనపడలేదన్న మాజీ మంత్రి, ఇప్పుడు మళ్లీ ప్రారంభమైందని, మళ్లీ ట్యాంకర్లకు గిరాకీ వచ్చిందని వ్యాఖ్యానించారు.
MLA Jagadish Reddy about Crop Loss : 2014కు ముందు పరిస్థితులు అద్దం పడుతున్నాయని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. పంటలు నష్టపోయిన రైతులకు రాష్ట్రం ప్రభుత్వం వెంటనే పరిహారం ఇవ్వాలని, రెండు లక్షల రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ సాకు చూపకుండా ఈసీ అనుమతితో రుణమాఫీ చేయాలన్న ఆయన, అందరికీ రైతుబంధు ఇవ్వాలని పేర్కొన్నారు. పంటలకు అన్నింటికీ 500 రూపాయల బోనస్ ఇవ్వాలని, పంట నష్ట పోయిన రైతులకు ఎకరాకు 25 వేల రూపాయల పరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ తరపున జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు.
'గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం నీళ్లు కూడా ట్యాంకర్ల ద్వారా కొనుక్కునే పరిస్థితి వచ్చింది.'- జగదీశ్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే