BRS MLA Harish Rao Meet Jainur Victim : హత్యాచార బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆసిఫాబాద్ జైనూర్ బాధితురాలిని మాజీ మంత్రులు హరీశ్‌రావు, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి సహా పలువులు నేతలు పరామర్శించారు. అనంతరం రైతు బంధు రాలేదని ఆత్మహత్య చేసుకున్న సురేందర్ రెడ్డి మృతదేహానికి హరీశ్‌రావు గాంధీ ఆసుపత్రిలోనే నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్‌రావు, తెలంగాణలో హత్యాచార ఘటనలు నిత్యకృత్యం అయ్యాయని మండిపడ్డారు. 9 నెలల కాలంలోనే సుమారు 1,900 వరకు హత్యాచార ఘటనలు, 4 మత ఘర్షణలు జరిగాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సర్కార్ శాంతి భద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను సర్కారు పాడు చేస్తోందని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై హోం శాఖ సీరియస్‌గా జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : ఆసిఫాబాద్ బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో నాటు తుపాకులు రాజ్యమేలుతున్నాయని అన్నారు. కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకుని రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేయాలని కోరారు. పోలీసులను ప్రభుత్వం పని చేయనీయట్లేదని విమర్శలు చేశారు. వరద నిర్వహణ, రుణమాఫీ అమలులో ప్రభుత్వం విఫలం అయిందని హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
" ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు లా అండ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. తొమ్మిది నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 1900 హత్యాచారాలు జరిగాయి. సబితా అసెంబ్లీలో మాట్లాడుతూ రాష్ట్రంలో హత్యాచారాలు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని చెప్పారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది. మరుసటి రోజే హైదరాబాద్‌లో నాలుగు హత్యాచారాలు జరిగాయి. ఒకప్పుడు కేసీఆర్ షీ టీమ్స్‌ను ఏర్పాటు చేసి మహిళలకు రక్షణగా వారిని నియమించారు. పదేళ్లు రాష్ట్రాన్ని, హైదరాబాద్‌ను కంటికి రెప్పలా కాపాడుకున్నాము. లా అండ్ ఆర్డర్లో దేశానికే తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దారు. కానీ ఈరోజు రాష్ట్రం ఎటుపోతుంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తున్నారు." - హరీశ్‌రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే