BRS Leader Harish Rao Comments on Congress, BJP : మెదక్ పార్లమెంట్ సీటు గులాబీ ఓటమి ఎరుగని సీటు అని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. మెదక్ జిల్లాలోని నరసాపూర్ మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, గులాబీ కంచుకోటలో మరో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఒకరు మతంతో మరొకరు కులంతో మెదక్ లోక్‌సభ సీటు కోసం పోటీకి వస్తున్నారని దుయ్యబట్టారు. తాము మాత్రం గతంలో చేసిన అభివృద్ధిని చూపుతూ ఓటు అడుగుతున్నామని వివరించారు.
BRS Focus on Parliament Elections : దుబ్బాకలో చెల్లని రూపాయి ఇప్పుడు మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా చెల్లుతుందని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావును ఉద్దేశించి హరీశ్‌రావు విమర్శించారు. భారీ మెజారిటీతో దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారన్నారు. మెదక్ ఎంపీ సీటు కోసం బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి జీవితం తెరిచిన పుస్తకం లాంటిదని అన్నారు. ఆయనపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్న మాజీమంత్రి, పేదలు వస్తే తన కుటుంబ సభ్యులుగా చూసే మంచి మనసున్న వ్యక్తిగా వెంకటరామిరెడ్డిని కొనియాడారు.
20 ఏళ్లుగా ప్రజలకు సేవచేసి వారి హృదయాలను గెలుచుకున్నారన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూసేకరణ చేస్తే దాన్ని రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నీటి ప్రాజెక్టులు కట్టడం వల్ల మెదక్ జిల్లాలో వరి పంట ఎక్కువగా నష్టపోలేదని పేర్కొన్నారు. చెక్ డ్యామ్‌ల నిర్మాణంతో పంటలు బాగా పండుతున్నాయని వివరించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ వంటివి పెంచడం వల్ల రైతులకు వరి కోత యంత్రాల ధర ఏకంగా రూ. 2,400కు పెరిగిందని ఆక్షేపించారు.
మెదక్ సీటు మాదే - రెండో స్థానం కోసం మిగిలిన పార్టీలు పోటీ : బీజేపీ ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదన్న హరీశ్‌రావు, నాడు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ దగ్గరకు వెళ్లి ధాన్యం కొనుగోలు చేయాలని కోరగా తాము కొనలేమని తెలంగాణ వారిని నూకలు బుక్కుమని చెప్పారన్నారు. ప్రస్తుతం ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరక్తి వచ్చిందన్నారు. మెదక్ సీటుపై గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేసిన హరీశ్‌రావు, రెండవ స్థానం కోసం మిగిలిన రెండు పార్టీలు పోటీ పడుతున్నట్లు ఎద్దేవా చేశారు. ఆయనతోపాటు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి, ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.