Harish Rao challenges CM Revanth on 2 lakh Waiver : ఆగస్టు 15 లోపు రూ.39 వేల కోట్లు రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తారా? అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు సవాల్ విసిరారు. సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్‌లో గులాబీ ముఖ్య నేతలతో మాజీ మంత్రి సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడిన హరీశ్‌రావు, ఇప్పటివరకు రైతుబంధు పూర్తిగా ఇవ్వలేదని, ఇంకా పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తా అంటున్నారని సీఎంపై ధ్వజమెత్తారు.
కాంగ్రెస్‌ను ఓడించడానికి 100 కారణాలు : ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలే ఆ పార్టీకి భస్మాసుర హస్తం అవుతాయని విమర్శించారు. భువనగిరి కాంగ్రెస్ సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి, తనను ఎందుకు ఓడించాలో చెప్పాలంటున్నారు. వారిని ఓడించడానికి 100 కారణాలు ఉన్నాయని హరీశ్‌రావు అన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యానికి బోనస్, ఆసరా పెన్షన్ పెంపు, మహిళలకు రూ.2500 సహాయం, కల్యాణ లక్ష్మికి తులం బంగారం, నిరుద్యోగ భృతిపై మాట తప్పినందుకు కాంగ్రెస్‌ను ఓడించాలని ప్రజలకు సూచించారు.
"ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానంటూ, ఎవరి చెవుళ్లో పువ్వు పెడుతున్నారు. ఏకకాలంలో రూ.39 వేల కోట్లు రుణమాఫీ చేయకపోతే, సీఎం పదవికి రాజీనామా చేయటానికి రేవంత్‌రెడ్డి మీరు సిద్ధమా? ఎన్నికల ప్రచారాల్లో దేవుడ్ని వాడుకోవటం కాదు. మీరు వంద రోజుల్లో ఈ హామీ ఎందుకు నెరవేర్చలేదు. ప్రమాణ స్వీకారం అనంతరమే చేస్తానని మాట ఏమైంది? అన్ని అబద్ధపు మాటలు చెప్పుకుంటూ మీ ప్రభుత్వం అధికారమెక్కింది."-హరీశ్‌రావు, బీఆర్ఎస్ సీనియర్ నేత
BRS Leader Harish Rao Comments on Congress : రేవంత్ రెడ్డి అంటే మాటల కూతలు, కాంగ్రెస్ అంటే కరెంట్ కోతలు అని హరీశ్‌రావు దుయ్యబట్టారు. నాలుగున్నర నెలల్లోనే సీఎం ఏదేదో చేసినట్టు ఓటేయకపోతే పథకాలు బంద్ అవుతాయని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆక్షేపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయన్న మాజీ మంత్రి, కాంగ్రెస్ అంటే కరవు, కరెంట్ కోతలు, మంచినీళ్ల కష్టాలు, అవినీతి అన్నారు.
2014, 2019 రెండుసార్లు దేశంలో కాంగ్రెస్‌కు కనీసం ప్రతిపక్ష హోదా దక్కలేదని గుర్తు చేశారు. హస్తం పాలన వద్దని ప్రజలు అనుకుంటున్నారని, అలానే కాంగ్రెస్ పార్టీ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు, హనుమంతరావులే తమ సీఎం కలవట్లేదు అని అంటున్నారని వివరించారు. మెడలో పేగులేసుకుంటా, మానవ బాంబునై పేలుతా, డ్రాయర్ ఊడగొడుతా అని సీఎం పదవికి అర్థం లేకుండా మాట్లాడుతున్నారని హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.