BRS Leaders On Farmers Suicides in Telangana : రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు నిత్యకృత్యం అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో ఒక రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలితే, తన సమస్యకు పరిష్కారం చూపడం లేదనే ఆవేదనతో బుధవారం సీఎం సొంత జిల్లాలోనే ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని అన్నారు. ఈ ఘటనలు మరువక ముందే ఖమ్మం కారేపల్లి మండలం, ఆలియా తండాలో మరో రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలేందుకు సిద్ధమయ్యారని మాజీ మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు నిత్యకృత్యం అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గం.
— Harish Rao Thanneeru (@BRSHarish) July 4, 2024
ఖమ్మం జిల్లాలో మొన్న ఒక రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలితే, తన సమస్యకు పరిష్కారం చూపడం లేదనే ఆవేదనతో నిన్నసీఎం గారి సొంత జిల్లాలోనే ఓ రైతు… pic.twitter.com/xwPPUVtJ4E
పురుగుల మందే రైతులకు పెరుగన్నం : రైతుల ఆత్మహత్యలు నివారించేందుకు, వారి సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ, పట్టెడన్నం పెట్టే రైతుల సంక్షేమం పట్ల లేదని మండిపడ్డారు. పురుగుల మందే రైతన్నలకు పెరుగన్నం అయ్యే దుర్భర పరిస్థితులను ఏడు నెలల కాంగ్రెస్ పాలన మళ్లీ తీసుకొచ్చిందని ఆక్షేపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని, రైతుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని బీఆర్ఎస్ పక్షాన హరీశ్ రావు డిమాండ్ చేశారు.
పంట నష్టపోయామని దంపతుల ఆత్మహత్యాయత్నం - భర్త మృతి, భార్య పరిస్థితి విషమం
BRS MLC Thatha Madhu on Farmer Suicide : ఖమ్మం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ విషయంలో కాంగ్రెస్ నేతలు దారుణంగా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు ఆరోపించారు. పాలన గాలికి వదిలేసి ముఖ్యమంత్రి, మంత్రులు దిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని జులై నెల వచ్చినా ఇంకా రైతు భరోసా దిక్కు లేదని మండిపడ్డారు.
చింతకాని మండలంలో ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశానని, కాంగ్రెస్ వ్యక్తినని తన మరణ వాగ్మూలంలో చెప్పినట్లు మధు పేర్కొన్నారు. ప్రభాకర్ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. రైతు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులను వెంటనే అక్కడ నుంచి బదిలీ చేయాలని అప్పుడే రైతు కుటుంబానికి న్యాయం జరుగుతుందని ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు.