BRS Leaders on New Criminal Laws in India : జులై 1 నుంచి అమల్లోకి రాబోతున్న కొత్త న్యాయ చట్టాలను మోదీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యాలయంలో మాట్లాడిన ఆయన కొత్త చట్టం, వాటి ఇబ్బందులపై మాట్లాడారు.
కొత్త చట్టాలకు హిందీ పేర్లు : రాజ్యాంగంలో ఆర్టికల్ 348 ప్రకారం కొత్త చట్టాలు ఆంగ్లంలోనే అమలు చేయాలని ఉందన్నారు. కానీ దానికి విరుద్ధంగా కొత్త చట్టాల పేర్లను హిందీలో పెట్టారని ఆరోపించారు. హిందీ సంస్కృతిని బలవంతంగా అన్ని రాష్ట్రాలపై రుద్దాలని ప్రధానీ మోదీ, అమిత్ షా చూస్తున్నారన్నారు. ఇండియన్ పీనల్ కోడ్‌ను భారతీయ న్యాయ సన్నిహితగా మార్పు చేశారని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌ను భారతీయ నాగరిక సురక్ష సన్నిహితగా, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌ను భారతీయ సాక్ష అభియాన్ అని పేరు మార్చారని తెలిపారు. దక్షిణ భారత దేశంలో బలవంతంగా హిందీని రుద్దడం ఏంటని ప్రశ్నించారు.
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు ఇందిరా జయసింగ్ సుధీర్ఘ లేఖ రాశారని, ఆ లేఖపై దేశంలో ఉన్న మేధావి వర్గం సుమారు 3 వేల మంది వరకు మేధావులు సంతకాలు పెట్టారన్నారు. అందులో మహాత్మా గాంధీ మనవడు కూడా ఉన్నారని తెలిపారు. గతంలో రైతులు అలానే తెచ్చారని, అన్నదాతలు ఉద్యమం చేస్తే వాటిని వెనక్కి తీసుకున్నారని గుర్తుచేశారు.
చట్టాలను మార్చే విధంగా చట్టాలు : కొత్త చట్టాలు ప్రభుత్వం కనుసన్నల్లో నడిచే విధంగా ఉన్నాయని బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇంఛార్జీ సోమ భరత్ ఆరోపించారు. రాజ్యాగంలో ప్రాథమిక హక్కులు ఎలా అయితే ఉన్నాయో వాటికి అనుగుణంగా ఇండియన్ పీనల్ కోడ్‌ను మార్చుకున్నామని తెలిపారు. అమల్లో ఉన్న చట్టాలని మార్చే విధంగా కొత్త చట్టాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం ఇచ్చే హక్కులను హరించే విధంగా కొత్త చట్టాలు ఉన్నాయన్నారు. కొత్త చట్టాలకు మోదీ ముద్ర వేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.
కొత్త చట్టాల వల్ల వందల జైళ్లు పెట్టిన సరిపోవన్నారు. బలం ఎవరికి అయితే ఉంటుందో వారికి కొత్త చట్టం చుట్టం కాబోతుందన్నారు. ఏదైనా కొత్త చట్టం తీసుకోని వస్తే అందరికీ అర్థమయ్యేలా ఉండాలి, హిందీ వచ్చే వారికీ మాత్రమే అర్థమయ్యేలా సంవిదా, అభియాన్ అని పేర్లు పెట్టారన్నారు. భారత రాష్ట్ర సమితి లీగల్ సెల్ తరుపున వెంటనే కొత్త చట్టాలను ఆపేయాలి అని డిమాండ్ చేశారు.
కొత్త క్రిమినల్ చట్టాలు ఏ కేసులకు వర్తిస్తాయి? కేవలం కొత్త వాటికేనా?