Vinod Kumar Comments on Revanth Reddy : ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఆర్నెళ్లలో చెప్పుకోదగ్గ పని ఒక్కటి కూడా లేకపోవడం దురదృష్టకరమని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. ఈరోజు సాయంత్రం మంత్రిమండలి సమావేశం ఉందని అంటున్నారని, కనీసం ఇందులోనైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. రైతుబంధు పథకం గురించి చర్చించాలన్నారు. ప్రధానితో సహా చాలా మంది ఈ పథకాన్ని స్వాగతించారని గుర్తు చేశారు. పీఎం కిసాన్ పథకానికి స్ఫూర్తి రైతుబంధు అని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.
Vinod Kumar Fires on Congress : రోహిణి కార్తె సమయంలో పెట్టుబడి కోసం రైతు తిరుగుతారని వినోద్‌కుమార్ అన్నారు. పంట కోతల తర్వాత రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతుబంధు ఇచ్చిందని విమర్శించారు. వెంటనే అన్నదాతలకు రైతుబంధు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇస్తామన్న రైతు భరోసా ఇప్పటి వరకు అమలు కాలేదని ఆరోపించారు. రైతుభరోసా అమలు చేసి ఎకరానికి రూ.15,000 విడుదల చేయాలని వినోద్‌కుమార్ అన్నారు.
వరి పండించిన రైతుకు రూ.500 బోనస్ ఇస్తామన్నారని వినోద్‌కుమార్ పేర్కొన్నారు. యాసంగిలో రైతులు 90 శాతం సన్నవడ్లు వేయరని చెప్పారు. సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని, బోనస్‌ను బోగస్‌గా చేయవద్దని సూచించారు. ఒకవేళ అలా లోక్‌సభ ఎన్నికల ముందు చెప్పి ఉంటే, కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా వచ్చేది కాదన్నారు. తిట్లతో సమస్య పరిష్కారం కాదని, మనసు పెట్టి ఆలోచించాలని తెలిపారు. అకాల వర్షాలకు వరి ధాన్యం తడిసి ముద్దయిందని, కేబినెట్‌లో నిర్ణయం తీసుకొని మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలని వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లాం : కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకతను తాము ప్రజల్లోకి బాగా తీసుకెళ్లామని వినోద్‌కుమార్ వివరించారు. హస్తం పార్టీ చేసిన మోసాలను ప్రజలకు వివరించామని చెప్పారు. ఆ వ్యతిరేకత ఓటు తనకు పూర్తిగా మళ్లితే కరీంనగర్‌లో తన గెలుపు ఖాయమని అన్నారు. దేశంలో మోదీ ప్రభావం కనిపిస్తోందని వినోద్‌కుమార్ వెల్లడించారు.
"కాంగ్రెస్ ఇస్తామన్న రైతుభరోసా ఇప్పటివరకు అమలు కాలేదు. రైతుభరోసా అమలు చేసి ఎకరాకు రూ.15,000 విడుదల చేయాలి. రైతుల పట్ల సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా. వరి పండించిన రైతుకు రూ.500 బోనస్ ఇస్తామన్నారు. యాసంగిలో రైతులు 90 శాతం సన్నవడ్లు వేయరు. సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని, బోనస్‌ను బోగస్‌గా చేయవద్దు." - వినోద్‌కుమార్, బీఆర్ఎస్ మాజీ ఎంపీ
జిల్లాలు మారిస్తే ఉద్యోగాల భర్తీలో ఇబ్బందులొస్తాయి : వినోద్ కుమార్