Ponnala Lakshmaiah reacts on Rythu Runamafi : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్‌సభ ఎన్నికలు తన 100 రోజుల పాలనకు రెఫరెండం అని ఎందుకు మాట్లాడటం లేదని బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. హామీల అమలు, వంద రోజుల పాలనపై చర్చకు సిద్ధమా? అని ఆయన సవాల్ విసిరారు. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి పదవిలో ఉండి, అవాస్తవాలు ప్రచారం చేసి రేవంత్ రెడ్డి పబ్బం గడుపుకుంటున్నారని దుయ్యబట్టారు.
తన మాట మీద నమ్మకం లేక, దేవుని పేరు చెబుతూ రుణమాఫీ చేస్తామని చెప్పే స్థాయికి ముఖ్యమంత్రి దిగజారారని పొన్నాల దుయ్యబట్టారు. రైతుబంధు ఇవ్వడానికి 7700కోట్లు లేవు కానీ, 45 వేల కోట్లతో రుణమాఫీ ఇంకో వంద రోజుల్లోపు చేస్తామంటే ఎవరు నమ్ముతారని ఆయన ప్రశ్నించారు. రైతులను దగా చేస్తూ ప్రచారం చేస్తున్నారని, దుర్బుద్ధితో అధికారం కోసం తాపత్రయం పడుతున్నారని మండిపడ్డారు.
Ponnala Lakshmaiah fires on Congress : ఆరు గ్యారంటీలలో ఇచ్చిన 13 హామీల్లో ఐదు కూడా అమలు చేయలేదని, ఇంకా 420 గ్యారంటీలను ఎప్పుడు అమలుచేస్తారని పొన్నాల ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కు పెట్టిన వ్యక్తికి ఓట్లు అడిగే అర్హత ఉందా? అని నిలదీశారు. కేసీఆర్‌కు మాత్రమే ఓట్లు అడిగే అర్హత ఉందని, రేవంత్ రెడ్డికి ఓట్లు అడిగే అర్హత లేదని ఆయన దుయ్యబట్టారు.
ఒప్పంద ఉద్యోగులకు జీతాలు ఇవ్వని నేతలు, ఏం మొహం పెట్టుకొని మాట్లాడతున్నారని పొన్నాల మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకుంటానని కేసీఆర్ ఎక్కడా చెప్పలేదని, ఒక వ్యక్తి 20 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరతారంటే కేసీఆర్ అవసరం లేదని స్పష్టం చేశారని వివరించారు. ముఖ్యమంత్రిని చేసిన ఎమ్మెల్యేలను సీఎం రేవంత్‌రెడ్డి గొర్లమంద అని ఎలా అంటారని ఆయన మండిపడ్డారు. హామీల అమలు, వంద రోజులపాలనపై సీఎం రేవంత్‌రెడ్డి చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు.
జైపాల్ రెడ్డి, జానారెడ్డి లాంటి కాంగ్రెస్ సీనియర్ నేతలను రేవంత్‌రెడ్డి విమర్శిస్తున్నారని పొన్నాల ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యుత్తమ పార్లమెంటరీయన్ అవార్డు పొందిన జైపాల్ రెడ్డి, సుదీర్ఘకాలం జానారెడ్డి మంత్రిగా చేశారని, వారిముందు రాష్ట్ర పరిపాలనలో మీ అనుభవం ఎంత? అని ప్రశ్నించారు. దిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి అన్నిసార్లు ఎందుకు పోతున్నారో తెలియదా? అని ప్రశ్నించారు.
"సీఎం రేవంత్ రెడ్డి రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ పేరుతో కొత్త పాట ఎత్తుకున్నారు. రాబోయే వంద రోజుల్లో రెండు లక్షల రుణమాఫీ చేస్తామంటే ఎవరూ నమ్మరు. రైతు భరోసా కోసం రూ.7700 కోట్లు లేవు కానీ, రూ.45000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు". - పొన్నాల లక్ష్మయ్య, బీఆర్ఎస్ నేత