KTR Questioned PM Modi On Double R Tax in Telangana : తెలంగాణలో ఛోటా భాయ్ అక్రమంగా డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న మీరేం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. మెదక్ సభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నారని, మరి ఛోటా భాయ్ నిర్వాకాన్ని మాత్రం ఎందుకు క్షమిస్తున్నారని నిలదీశారు.
బడే భాయ్, ఛోటా భాయ్ ది ఒకే మాట : ఛోటా భాయ్ అక్రమాలు, డబుల్ ఆర్ ట్యాక్స్ వసూళ్లను చూసీ చూడనట్టు వదిలేస్తే, రేపు డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటుకు మీకు సహకరిస్తారనా అని కేటీఆర్ మోదీని ప్రశ్నించారు. తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా, బడే భాయ్, ఛోటా భాయ్ ది ఒకే మాట – ఒకే బాట అని విమర్శించారు. ఒకరు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును బలి చేయాలని చూస్తుంటే, మరొకరు తమిళనాడు కోసం తాకట్టుపెట్టాలని ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ ఆక్షేపించారు.
'గోదావరి జలాలను తరలించుకుని పోవాలనేనా కాళేశ్వరంపై ఈ కక్ష?. ప్రధానికి, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రైతులపై ఎందుకీ వివక్ష. లోక్‌సభ ఎన్నికల వేళ రాష్ట్రానికి వచ్చారని, మరి అదే పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలకు ఎందుకు పాతరేశారు. పదేళ్లు గడిచినా తెలంగాణ విభజన హక్కులను ఎందుకు కాలరాశారు. అత్యున్నత చట్టసభలో ఇచ్చిన హామీలకే దిక్కులేకపోతే, బహిరంగ సభల్లో బీజేపీ వాగ్దానాలను ప్రజలెలా విశ్వసిస్తారని' కేటీఆర్ ప్రశ్నించారు.
KTR Comments On PM Modi : కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని దెబ్బతీసే, ఈ ఫెవికాల్ బంధంపై యుద్ధానికి తెలంగాణ సమాజం సిద్ధమని కేటీఆర్ తెలిపారు. అచ్చే దిన్, సబ్ కా సాత్, సబ్ కా విశ్వాస్ అంటూ, ఇచ్చిన నినాదాలు ఎందుకు విధానాలుగా మారలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్ల బీజేపీ పాలన తర్వాత కూడా ఉచిత రేషన్ పథకం కింద దేశంలో రూ.80 కోట్ల మంది పేదలు ఎందుకు ఉన్నారో వివరించాలని ప్రశ్నించారు. వికసిత్ భారత్ ఎలా సాధ్యమో సెలవివ్వాలని కేటీఆర్ అడిగారు.
'మండుతున్న ధరలపైనా, తీవ్రమవుతున్న నిరుద్యోగంపైనా, దళితులపై జరుగుతున్న దాడులపైనా, మైనార్టీల్లో పెరుగుతున్న అభద్రతపైనా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అన్యాయం. అవినీతి పరులకు బీజేపీని కేరాఫ్‌గా మారింది. రాజకీయ ప్రత్యర్థులపై కక్షగట్టి పెడుతున్న కేసులకు, ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమ అరెస్టులు చేస్తున్నారు. దీనిని తెలంగాణ ప్రజలే కాదు, యావత్ భారత సమాజం గమనిస్తోంది' - కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
Double R Tax in Telangana : దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసిన కాంగ్రెస్‌కు ఏ దుస్థితి పట్టిందో, త్వరలో బీజేపీకి కూడా దేశ ప్రజానీకం అదే గుణపాఠం చెప్పి తీరుతుందని కేటీఆర్ విమర్శించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి, అదే రాజ్యాంగాన్ని కాలరాయడం భావ్యమా అని ప్రశ్నించారు. అవే రాజ్యాంగ సంస్థలను దెబ్బతీయడం ధర్మమా అని అడిగారు. నాడు హస్తం పార్టీ పాలనలో దేశం ఎమర్జెన్సీని చూసిందని, నేడు భారతీయ జనతా పార్టీ హయాంలో అనధికార ఎమర్జెన్సీని చవిచూస్తోందని ఆరోపించారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా, ఇంకెన్ని నిర్బంధాలు విధించినా, రాజ్యాంగాన్ని రక్షించుకుంటామని, తెలంగాణ హక్కులను కాపాడుకుంటామని కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.
బీజేపీ అరాచకాలను అడ్డుకునే సత్తా గులాబీ జెండాకే ఉంది : కేటీఆర్ - KTR ON BJP RESERVATION COMMENTS