KTR Tweet On Villages and Towns Situation : పదేళ్లు పచ్చగా కళకళలాడిన పల్లెలు, ప్రగతిపథంలో దూసుకుపోయిన పట్టణాలు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సంక్షోభంలో కొట్టుమిట్టాడటం ప్రభుత్వ అసమర్థత, పాలనా వైఫల్యాలకు నిలువెత్తు నిదర్శనమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో పల్లెలు, పట్టణాలు కంపు కొడుతున్నాయన్న ఆయన, ఓవైపు తెలంగాణ పల్లెల్లో పాలన పూర్తిగా పడకేసిందని, మరోవైపు పట్టణాల్లో పరిస్థితి అధ్వాన్నంగా మారిందని ఆరోపించారు.
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోవడంతో పంచాయతీలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయిని అన్నారు. పాత పనులకు ఎనిమిది నెలలైనా బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన తాజా మాజీ సర్పంచుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని కేటీఆర్ పేర్కొన్నారు. పారిశుధ్యం, డ్రైనేజీ నిర్వహణ అధ్వాన్నంగా మారడంతో పల్లెల్లో ప్రజల జీవనం దినదిన గండంలా మారిందని, దోమల మందుకు కూడా నిధులు లేకపోవడంతో పంచాయతీల్లో డెంగ్యూ, మలేరియా విజృంభిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పాలనలో.. పల్లెలు, పట్టణాలు కంపు కొడుతున్నాయి..
— KTR (@KTRBRS) August 14, 2024
ఓవైపు తెలంగాణ పల్లెల్లో పాలన పూర్తిగా పడకేసింది.. మరోవైపు పట్టణాల్లో పరిస్థితి అధ్వాన్నంగా మారింది..
అటు కేంద్రం నుంచి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోవడంతో పంచాయతీలు తీవ్ర సంక్షోభంలో… pic.twitter.com/Yk6qlkejWT
పెండింగ్ బిల్లులు అడిగిన పాపానికి 1800 మాజీ సర్పంచ్‌లపై నిర్బంధాలు : పంచాయతీలకు నిధులివ్వకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనా, ప్రజాపాలన అంటే అని కేటీఆర్ అడిగారు. బీఆర్ఎస్ హయాంలో పంచాయతీలకు ప్రతినెలా ఠంచన్‌గా 275 కోట్ల రూపాయలు విడుదల చేశామని, ఇపుడు పెండింగ్ బిల్లులు అడిగిన పాపానికి 1800 మంది మాజీ సర్పంచ్‌లపై నిర్బంధాలు, అక్రమ అరెస్టులు జరుగుతున్నారని ఆక్షేపించారు. 15వ ఆర్థిక సంఘం నుంచి అందిన రూ.500 కోట్ల నిధులను గ్రామపంచాయతీలకు ఇంకా ఎప్పుడు ఇస్తారని నిలదీశారు.
ఉపాధి హామీ పథకం, హెల్త్ మిషన్ నుంచి వచ్చిన రూ.2100 కోట్ల కేంద్ర నిధులను ఎందుకు దారి మళ్లించారని మాజీ మంత్రి ప్రశ్నించారు. 12,769 పంచాయతీల్లో పేరుకుపోయిన విద్యుత్ బకాయిలే రూ.4305 కోట్లని అంచనా ఉందని, వాటి పరిస్థితి ఏమిటని అడిగారు. దేశానికే పట్టుగొమ్మలుగా భావించే పల్లెలపై కాంగ్రెస్ పాలనలో ఎందుకింత నిర్లక్ష్యమన్న ఆయన, కాంగ్రెస్ పాలనలో పల్లెల్లో పాలన పూర్తిగా పడకేస్తే, పట్టణాలు పెను సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని ఆరోపించారు.
ప్రజాపాలనలో పల్లె ప్రగతికి పాతర -పట్టణ ప్రగతికి నో అడ్రస్ : గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు, 129 మున్సిపాలిటీల్లో కనీసం కార్మికులకు వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. బడ్జెట్లో జీహెచ్ఎంసీకి అరకొర నిధులు కేటాయించడంతో మహానగరంలో అభివృద్ధి పనులు పూర్తిగా మూలనపడిన మాట వాస్తవం కాదా అన్న కేటీఆర్, కాంగ్రెస్ చెప్పుకునే ప్రజాపాలనలో పల్లె ప్రగతికి పాతరేసి, పట్టణ ప్రగతిని అడ్రస్ లేకుండా చేసిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు.
మున్సిపాలిటీల్లో పెండింగ్ పనులకు మోక్షం లేదని, కొత్త పనులకు ప్రణాళిక లేదని అన్నారు. నిధులు లేక పూర్తిగా నీరసించిన మున్సిపాలిటీల్లో కనీసం అత్యవసర మరమ్మత్తులకు కూడా పైసలు లేకపోవడం దుర్మార్గం కాదా అని అడిగారు. వర్షాకాలంలో అధ్వాన్నంగా మారిన రోడ్లతో ప్రతినిత్యం అవస్తలు పడుతున్న ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మున్సిపాలిటీల్లో రూ.1200 కోట్లకు పైగా ఉన్న పెండింగ్ బిల్లులను ఇంకెప్పుడు విడుదల చేస్తారని సాక్షాత్తూ ముఖ్యమంత్రే స్వయంగా పర్యవేక్షిస్తున్న పురపాలక శాఖకే ఈ స్థాయిలో నిధుల కొరత ఉంటే ఇక ఇతర శాఖల దుస్థితి ఏమిటని అన్నారు.
KTR Comments On CM Revanth : ఆగస్టు 15 లోపు బకాయిలు చెల్లించకపోతే ఆందోళనకు సిద్ధమవుతున్న మున్సిపల్ కాంట్రాక్టర్ల కష్టాలను తీర్చే తీరిక, కనీసం కార్మికులకు వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి నుంచి పురపాలక శాఖను ఇప్పటికైనా గట్టెక్కించే ధైర్యం ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. మున్సిపాలిటీల్లో దెబ్బతిన్న రోడ్లు, పొంగిపొర్లుతున్న డ్రైనేజీల మరమ్మత్తులను యుద్ధప్రాతిపదికన చేపట్టే ఆలోచన ఉందా అని ప్రశ్నించారు. ఇదంతా పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం, అసమర్థతతే అన్న కేటీఆర్, ప్రభుత్వం చేతకానితనాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోందనే విషయాన్ని మరిచిపోవద్దని పేర్కొన్నారు.