BRS Leader Harish Rao Comments on Congress : రైతు సురేందర్ రెడ్డి మృతికి కారణం రుణమాఫీ కాకపోవడమేనని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రుణమాఫీకి రేషన్ కార్డుతో సంబంధం లేదనటం అవాస్తవమని తెలిపారు. రుణమాఫీ పేరుతో రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడకు సురేందర్ రెడ్డి బలయ్యారని పేర్కొన్నారు. ఆయన మృతి కాంగ్రెస్ 9 నెలల పాలనకు పరాకాష్ఠ అని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ 'మేము లిస్ట్ ఇచ్చినా ఒక్క రైతును కూడా ఆదుకోలేదు. రోజుకో మాటగా రేవంత్ పాలన సాగుతోంది. ఊసరవెల్లి కన్నా దారుణంగా రేవంత్ తీరు ఉంది. రుణమాఫీ చేసింది రూ.15 వేల కోట్లే. ఇది రైతులను మోసం చేయడం కాదా? మీ రాజకీయాల కోసం కుటుంబ బంధాల మధ్య చిచ్చు పెట్టారు. పింఛన్ రూ.2000 చేసి కుటుంబాలను బలోపేతం చేశారు కేసీఆర్' అని తెలిపారు.
సురేందర్ రెడ్డి సూసైడ్ నోట్లో తల్లి కూడా కారణం అని రాయడానికి దారి తీసింది రుణమాఫీ సమస్య అని మాజీ మంత్రి హరీశ్‌రావు వివరించారు. ఒక రేషన్ కార్డుపై తల్లీకుమారులు ఉంటే ఒక్కరికే రుణమాఫీ ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది ప్రజలను మోసం చేయడం కాదా? అని నిలదీశారు. వ్యవసాయ శాఖ అధికారులకు ఫేస్ 3 లబ్ధిదారుల వివరాలు ఇవ్వలేదని, నేరుగా బ్యాంక్‌కు ఇచ్చారని అన్నారు. పాస్‌బుక్, రుణ ఖాతా ఆధారంగా రుణమాఫీ చేయాలి కదా అని ప్రశ్నించారు.
నమ్మి ఓటేసినందుకా ఈ కోతలు : క్రాప్ లోన్ రెన్యూవల్ చేయకపోతే రుణమాఫీ చేయకపోవడం దారుణమని మాజీ మంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు. నమ్మి ఓట్లు వేసినందుకు కోతలు పెడుతోంది ఈ ప్రభుత్వమని విమర్శించారు. గిరిజనేతర రైతులకు కూడా రుణమాఫీ అవ్వలేదని చెప్పారు. రూ.2 లక్షల రుణమాఫీపై అసలు సరిగా క్లారిటీ లేదని అన్నారు. సురేందర్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వమే చంపిందని మాజీ మంత్రి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
"రుణమాఫీ కాకపోవడమే రైతు సురేందర్ రెడ్డి మృతికి కారణం. రుణాఫీకి రేషన్కార్డ్తో సంబంధం లేదనటం అవాస్తవం. సురేందర్ రెడ్డి మృతి మీ తొమ్మిది నెలల పాలనకు పరాకాష్ఠ. మేము లిస్ట్ ఇచ్చినా ఒక్క రైతుని కూడా ఆడుకోలేదు. రుణమాఫీ చేసింది రూ.15 వేల కోట్లే. గిరిజనేత రైతులకు కూడా రుణమాఫీ అవ్వలేదు. రూ.2 లక్షల రుణమాఫీపై అసలు క్లారిటీ లేదు ఇప్పటికైనా రైతులకు క్షమాపణ చెప్పి రుణమాఫీ చేయండి. మా కాల్ సెంటర్‌కు లక్షకు పైగా ఫిర్యాదులు వచ్చాయి. ఆ వివరాలు గవర్నర్, ప్రభుత్వానికి అందిస్తాం." - హరీశ్‌రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే