Harish Rao MLC By election Campaign in Khammam : తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ బండి రివర్స్ గేర్‌లో నడుస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్ర రాజధానిపై కాంగ్రెస్, బీజేపీలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. మరో పదేళ్లు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేసే కుట్ర జరుగుతోందన్నారు. గతంలో పదేళ్లు కామన్ క్యాపిటల్ అంటేనే కేసీఆర్ వ్యతిరేకించారనీ తెలిపారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఒక్క బస్సు తప్పా, అన్ని పథకాలు తుస్సే : ఖమ్మం జిల్లా బోనకల్లులో నిర్వహించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఎన్నికలైన నాలుగు నెలల లోపే కాంగ్రెస్ మోసం బయటపడిందని అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్క బస్సు తప్పా, అన్ని పథకాలు తుస్సేనని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో కరెంటు 24 గంటలు ఇస్తే ఇప్పుడు కాంగ్రెస్ 14 గంటలు మాత్రమే ఇస్తోందని ఆరోపణలు చేశారు.
"హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా మరో పదేళ్లు పెంచాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయి. మన హైదరాబాద్ మనకి ఉండాలి, రాష్ట్ర రాజధానిగా ఉండాలే కానీ కామన్ క్యాపిటల్ కాకూడదు. అలా జరగకుండా ప్రశ్నించి, కొట్లాడే పార్టీ కేవలం బీఆర్ఎస్ మాత్రమే. హైదరాబాద్ లేని తెలంగాణ, తల లేని మొండెంలా మారిపోతుంది."-హరీశ్‌రావు, బీఆర్ఎస్ సీనియర్ నేత
Harish Rao Campaign in Khammam MLC By Election : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నీళ్లు, కరెంట్ మాయమయ్యాయని, కేసీఆర్ కిట్లు బంద్ అయ్యాయని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఇంకెన్ని రోజులు కేసీఆర్‌ను తిట్టుకుంటూ కాంగ్రెస్ నేతలు బతుకుతారని ప్రశ్నించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓడిస్తేనే కాంగ్రెస్‌కు కనువిప్పు కలుగుతుందని వ్యాఖ్యానించారు. నిరుద్యోగ భృతి గురించి అడిగితే, మేం హామీనే ఇవ్వలేదని కాంగ్రెస్ అంటుందని మండిపడ్డారు.
హైదరాబాద్ లేని తెలంగాణ - తల లేని మెుండెం వంటిది : కాంగ్రెస్‌కు ఓటు వేయడం అంటే, కాంగ్రెస్ అబద్ధాలను ఆమోదించడమేనని మాజీమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోయాయని, అంతా క్రాప్ హాలిడేలా ఉందన్నారు. ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను బీజేపీ ఏపీకి అప్పగించిందని దుయ్యబట్టారు. హైదరాబాద్‌ను యూటీగా చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ యత్నిస్తున్నాయన్న ఆయన, అదే జరిగితే హైదరాబాద్ మనకు దక్కదన్నారు. హైదరాబాద్ లేని తెలంగాణ, తల లేని మెుండెంలా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలు త్వరలోనే తిరగబడతారని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. రానున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి పట్టభద్రులంతా ఓటేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నామా నాగేశ్వరరావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ,తాత మధు ,జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, పట్టభద్రుల అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.