BRS Leader Harish Rao Comments on CM Revanth : హామీలపై నిలదీస్తే సీఎం రేవంత్‌రెడ్డి అసహనంతో మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హారీశ్‌రావు విమర్శించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, హోదాకు తగ్గట్టు మాట్లాడటం లేదని అన్నారు. మెదక్‌లో కాంగ్రెస్ ర్యాలీలో మరోసారి తన మూర్ఖత్వాన్ని సీఎం చాటుకున్నారని దుయ్యబట్టారు. తమను విమర్శించినప్పుడు, తాము కూడా ప్రతివిమర్శ చేయగలమన్న హరీశ్‌రావు, కానీ తమకు విజ్ఞత ఉంది కనుకనే విమర్శించడం లేదన్నారు.
రాజకీయాల్లో విలువులు పెరగాలనే తాము ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదంటూ మాజీమంత్రి హరీశ్‌రావు, సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డారు. ఈమేరకు సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌లో నిర్వహించిన విలేకర సమావేశంలో మాట్లాడారు. ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారని అని హరీశ్‌రావు ఆరోపించారు. రాహుల్ గాంధీ మీకు భాయ్ అయితే మోదీ బడే భాయ్ అన్నది మీరు కాదా అని ప్రశ్నించారు.
బీజేపీకి జోడీ, కేడీ రెండూ రేవంత్‌రెడ్డి : వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తానని, ఇంత వరకు అమలు చేయలేదన్నారు. బీజేపీకి జోడీ అయిన కేడీ అయిన అది రేవంత్ రెడ్డి అని విమర్శించారు. పార్టీలు మారిన వారిని తక్షణమే అనర్హత వేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెబుతుంటే, రేవంత్‌రెడ్డి మాత్రం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. అంటే కాంగ్రెస్ మేనిఫెస్టో తప్పుల తడకని తెలుస్తుందన్నారు.
"వ్యక్తిగతంగా మాట్లాడొద్దని చెప్పి మేము సంయోగత పాటిస్తూ వస్తే, ఇప్పటికే మమ్మల్ని పదిసార్లు తిట్టారు. దానికి ప్రతి దాడిగా మేము విమర్శలు చేయాల్సి వస్తుంది కదా, తిట్టలేక కాదు. రాజకీయాల్లో విలువలు పెరగాలని మేము ప్రయత్నిస్తున్నాం. సీఎం పదవిలో ఉండి, స్థాయికి తగని మాటలు మాట్లాడకూడదు."-హరీశ్‌రావు, బీఆర్ఎస్ సీనియర్ నేత
Harish Rao on Congress Guarantees : డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి చేయలేదని, ఇప్పటికీ కూడా మాఫీ చేయకుండా దేవుళ్లపై ప్రమాణాలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. నాడు సింగూరు జలాలను మెదక్‌కు దక్కేలా చేసింది కేసీఆరేనని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున మెదక్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న వెంకట్రామిరెడ్డిపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టిన మాజీమంత్రి, వేల ఎకరాలు లాక్కున్నారని అంటున్నారు కానీ భూ సేకరణ చేస్తేనే లక్షల ఎకరాలకు నీరు అందుతోందని తెలుసుకోవాలన్నారు.
రేవంత్‌రెడ్డి తన పదవి కోసం ఎవరినైనా తొక్కుతారు : రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వడగండ్ల వానలు కురుస్తున్నా, ఏ ఒక్క రైతును కలిసేందుకు మీకు తీరిక లేదు కానీ క్రికెట్ చూసేందుకు మాత్రం తీరిక దొరుకుతుందని ఎద్దేవా చేశారు. వెంటనే అకాల వర్షాలకు తడిసిన పంటలను కొనుగోలు చేయాలని, పంట నష్టం పరిశీలించి రైతులకు ఎకరాకు రూ.25 వేల పరిహారం చెల్లించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. అలానే రేవంత్ రెడ్డి తన పదవి కోసం ఎవరినైనా తొక్కుతారు అని హరీశ్‌రావు విమర్శించారు.