BRS Defeat in Loksabha Polls 2024 : రాష్ట్రంలో 14 లోక్‌సభ స్థానాలు గెలవబోతున్నామని అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి ఒక్కటంటే ఒక్క స్థానం కూడా దక్కని పరిస్థితి. 2023 శాసనసభ ఎన్నికల్లో ఓటమితో ప్రతిపక్ష పాత్రకే పరిమితమైన ఆ పార్టీ ఇప్పుడు లోక్‌సభలో ప్రాతినిధ్యం కోల్పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం వెంటనే జరిగిన లోక్‌సభ ఎన్నికలు పార్టీకి సవాల్‌గానే నిలిచాయి. ఎన్నికల కోసం సన్నాహక సమావేశాలు నిర్వహించి పార్టీని, శ్రేణులను సమాయత్తం చేసినప్పటికీ అంతగా ఫలితం ఇవ్వలేదు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఒక్క ఓటమికే నేతల వలసలు జోరందుకున్నాయి. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు సీనియర్ నేతలు, ఇతర ప్రజాప్రతినిధులు పార్టీకి గుడ్ బై చెప్పారు. చాలా చోట్ల పురపాలికలు, నగరపాలికలు గులాబీ పార్టీ నుంచి చేజారాయి. పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీకి గుడ్ బై చెప్పారు. శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన అనంతరం నేతలు, కార్యకర్తలు, శ్రేణుల్లో నిరుత్సాహం మరింతగా పెరిగి పోయింది. ఇది లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా దక్కకపోవడానికి కారణమైంది.
శాసనసభ ఎన్నికల ఓటమి అనంతరం బీఆర్ఎస్ అధిష్టానం నుంచి భరోసా ఇచ్చే ప్రయత్నాలు జరిగినా అవి అంతగా ఫలించక పోవడమే వారికి ఇబ్బందిగా మారింది. సీనియర్ నేతలు కేశవరావు, కడియం శ్రీహరి, ఎంపీలు రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్, వెంకటేష్ నేత, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకటరావు తదితరులు పార్టీకి గుడ్‌బై చెప్పారు. అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశాక రంజిత్ రెడ్డి, కడియం కావ్య పార్టీని వీడారు. మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడి ఇతర పార్టీల నుంచి లోక్‌సభ అభ్యర్థులుగా ఎన్నికల బరిలో దిగారు.
మరోసారి కారు బోల్తా - లోక్‌సభ ఎన్నికల్లో ఖాతా తెరవని బీఆర్ఎస్ - BRS Defeat in Lok Sabha Polls 2024
BRS Got Zero Seats in Telangana 2024 : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా తగిన గుణపాఠాలు నేర్చుకోలేదని, దిద్దుబాటు చర్యలు చేపట్టలేదన్న భావన పార్టీలో ఉంది. సన్నాహక సమావేశాల్లో వచ్చిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటున్నామని చెప్పినా అది జరగలేదని అంటున్నారు. అటు ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యేల చేతుల్లోనే లోక్‌సభ ఎన్నికల బాధ్యతలను ఉంచడాన్ని చాలా మంది కింది స్థాయి నేతలు జీర్ణించుకోలేదు. మాజీల కారణంగానే పార్టీ ఓడిపోతే తిరిగి వాళ్ల చేతిలోనే పెత్తనాన్ని పెట్టడంపై నిరుత్సాహం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల ఓటమికి ఇది కూడా ఓ కారణం.
చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు లోక్‌సభ ఎన్నికల్ని సీరియస్‌గా తీసుకోలేదని కూడా పార్టీలో చర్చ ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత ఆ పార్టీ అధినాయకత్వంలోనూ ఇంకా మార్పు రాలేదన్న భావన ఉంది. పార్టీలో అంతర్గత కలహాలున్నా పెద్దగా పట్టించుకోలేదని, సర్దుబాటు చేయలేదని చెప్తున్నారు. కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్కు దీటైన అభ్యర్థులు కరవయ్యారు. ముందు ఖరారు చేసిన వారు తప్పుకోవడంతో కొత్తవారిని అన్వేషించాల్సి వచ్చింది. మెదక్‌లోనూ అభ్యర్థిత్వంపై కూడా కొంత ఊగిసలాట చోటు చేసుకొంది. కేసీఆర్, హరీశ్‌రావు నియోజకవర్గాలు ఉన్న చోట మెదక్‌లో కూడా సానుకూల ఫలితాన్ని రాబట్టుకోలేక పోయింది. ఈ స్థానం పరిధిలోని నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వచ్చిన భారీ మెజార్టీలను కాదని లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి పెద్ద ఎత్తున ఓట్లు వచ్చాయి.
లోక్‌సభ ఎన్నికల బరిలో దిగని కేసీఆర్ కుటుంబం : కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరూ లోక్‌సభ ఎన్నికల బరిలో దిగకపోవడం కూడా బీఆర్ఎస్ ఓటమికి ఓ కారణంగా పార్టీ నేతలు చెప్తున్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి కొన్ని ఉపఎన్నికలను మినహాయిస్తే ప్రతి ఎన్నికలోనూ కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీలో నిలిచారు. కానీ ఈసారి ఎవరూ పోటీ చేయలేదు. కేసీఆర్ కుమార్తె కవిత అరెస్ట్ కాగా కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుల్లో ఎవరో ఒకరు పోటీ చేస్తారన్న ప్రచారం మొదట్లో జరిగింది. కానీ ఎవరూ లోక్‌సభ ఎన్నికల బరిలో దిగలేదు.
ఇక శాసనసభ ఎన్నికల్లో పట్టం కట్టిన గ్రేటర్ ఓటర్లు పూర్తిగా గులాబీ పార్టీకి దూరమయ్యారు. రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో పాటు లోక్ సభ ఎన్నికలు కావడంతో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు చేసిన వారు బీజేపీ వైపు వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల్లో అండగా నిలిచిన మైనార్టీలు ఈసారి పూర్తిగా బీఆర్ఎస్కు దూరమయ్యారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి బీఆర్ఎస్కి ఈ ఎన్నికల్లో ఏదీ కలసి రాకపోవడంతో ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేక పోయింది.
లోక్‌సభ ఎన్నికల ఓటమి నేపథ్యంలో ఇదే అదునుగా కాంగ్రెస్, బీజేపీ బీఆర్ఎస్ను అన్ని రకాలుగా దెబ్బ తీసే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. నేతల వలసలు కూడా జోరందుకునే అవకాశం లేకపోలేదు. ఈ పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవడంతో పాటు నేతలు, శ్రేణుల్లో స్థైర్యం కల్పించాల్సిన బాధ్యత బీఆర్ఎస్ అధినాయకత్వంపై ఉంది. నేతలు పార్టీని వీడకుండా చూసుకోవాలి. కార్యకర్తలు, శ్రేణుల్లో భరోసా కల్పించడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం చేయాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్కు భవిష్యత్ ఉంటుందన్న నమ్మకాన్ని పార్టీ నేతలు, శ్రేణుల్లో కల్పించాల్సిన కనీస బాధ్యత గులాబీ పార్టీపై ఉంది.